ఫ్లూయిడ్సు‌ తీసుకునేందుకు జగన్ నిరాకరణ

31 Aug, 2013 10:29 IST
హైదరాబాద్, 31 ఆగస్టు 2013:

శుక్రవారం అర్ధరాత్రి 11.45 సమయంలో హైడ్రామా మధ్య శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిమ్సుకు పోలీసులు తీసుకు వచ్చారు. నిమ్సు వైద్యులు శ్రీ జగన్‌కు బలవంతంగా ఫ్లూయిడ్సు ఎక్కించే ప్రయత్నం చేశారు. మొదటిసారి చేసిన వైద్యుల ప్రయత్నాన్ని శ్రీ జగన్ తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో అర్ధరాత్రి 12.30 సమయంలో రక్త నమూనా‌లు సేకరించే నెపంతో మరోసారి ఫ్లూయిడ్సు గొట్టాలను ఆయన ఒంట్లోకి గుచ్చేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని కూడా శ్రీ జగన్మోహన్‌రెడ్డి అడ్డుకున్నారు.

రాత్రి ఒంటి గంట సమయంలో మరోసారి శ్రీ జగన్‌కు నచ్చజెప్పేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ‘ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కాబట్టి ఫ్లూయిడ్సు ఇచ్చేందుకు అంగీకరించండి’ అని వారు కోరారు. మరోవైపు ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతూ, శరీరంలో ప్రమాదకరమైన కీటోన్సు సంఖ్య పెరగడంతో నెఫ్రాలజిస్టులను పిలిపించి పరీక్షలు చేయించారు.

శుక్రవారం అర్ధరాత్రికి శ్రీ జగన్‌ శరీరంలో కీలకమైన ఆరోగ్య సూచీలన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆయన బిపి 110/70 ఉండగా చక్కెర స్థాయిలు 60, పల్సు రేటు 56-60 ఉండగా కోటోర్లు 4+గా నమోదయ్యాయి. శ్రీ జగన్మోహన్‌రెడ్డి విపరీతమైన నీరసం, నడుంనొప్పితో బాధపడుతున్నారు. ఏడుగురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శ్రీ జగన్‌ తన దీక్షను పట్టుదలగా కొనసాగిస్తున్నారు.