నారాయణ.. నారాయణ..!
22 Aug, 2015 18:24 IST
చెలరేగుతున్న నారాయణ విద్యాసంస్థలు
ప్రభుత్వ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్న సంస్థలు
రాలిపోతున్న విద్యాకుసుమాలు
హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ నేతృత్వంలో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు నేల రాలిపోతుంటే తల్లిదండ్రుల గుండె కోత వర్ణనాతీతం. మొన్న ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థినిల తల్లిదండ్రులు నిజా నిర్ధారణ కమిటీ ముందు స్పష్టంగా వివరణ ఇచ్చారు.
చెలరేగుతున్న కార్పొరేట్ భూతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 2వేల దాకా ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 80 శాతం దాక నారాయణ సంస్థలు, వారితో అనుబంధం కుదుర్చుకొన్న మరో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 450 ప్రభుత్వ కాలేజీలను కొన్ని సంవత్సరాలుగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు పిల్లవాడు టెన్త్ పాస్ అయ్యాడు అంటే కచ్చితంగా ఈ రెండు సంస్థల్లోనే చేర్చాలి లేదంటే వెనుకబడి పోతాడు అన్న రీతిలో ర్యాంకుల గోల తో ప్రజల్ని మభ్య పెడుతూ వచ్చారు.
ఒత్తిడే ఒత్తిడి
తీరా చేసీ ఈ కాలేజీల్లో పెద్దగా వసతులు ఉండటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే దాదాపు 8వేల చదరపు అడుగుల భవనం, 2 ఎకరాల ఆటస్థలం ఉండి తీరాలి. పైన చెప్పిన కాలేజీల్లో ఎక్కడ అయినా ఈ సౌకర్యాలు కనిపిస్తాయా..! ఇరుకు గదులు, సరైన వెంటిలేషన్ లేకుండా గుడ్డి విద్యుత్ దీపాల వెలుగులో చదువులు సాగిపోతున్నాయి. మార్కు ల కోసం చేస్తున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు, తల్లిదండ్రుల మీద ఫీజుల కోసం చేస్తున్న ఒత్తిడికి అంతే లేదు. ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఫీజు అక్షరాలా 17వందల 60 రూపాయిలు. ఆఖరికి 17వేలకు కూడా సీటు ఇవ్వటం లేదు. లక్షలకు లక్షలు పిండి మరీ డబ్బు వసూలు చేస్తున్నారు.
రాలిపోతున్న విద్యా కుసుమాలు
చదువుల కోసం ఇంకా చెప్పాలంటే మార్కుల కోసం చేస్తున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. అప్పుడే టీనేజ్ ను దాటుతున్న విద్యార్థుల్ని నలుగురిలో పెట్టి అవమానించి అయినా సరే చదివించి మార్కులు రప్పించాల్సిందే, లేదంటే అధ్యాపకులకు నూకలు చెల్లిపోతాయి. అందుకే పిల్లల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇరుకు గదులు, గుడ్డి దీపాల వెలుగులో ఆట పాటలకు దూరంగా బందీలుగా మారిపోయిన పిల్లలు ఒత్తిడిని తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ఒక్క నారాయణ విద్యాసంస్థల్లోనే తొమ్మిదిమంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ నారాయణ విద్యాసంస్థల్ని ప్రభుత్వం బాగా వెనకేసుకొని వస్తోంది. దీన్ని బట్టి బాబు-నారాయణ అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది.