నిబంధనలు ఉల్లంఘించి వేమూరి కంపెనీకి ప్రసారాలు

29 Aug, 2017 14:30 IST
హైదరాబాద్‌: స్పీకర్‌ తన పరిధిని మించి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను అడ్వాన్స్‌డ్‌ టెలీ కమ్యూనికేషన్‌కు కట్టబెట్టారంటే చంద్రబాబు ఒత్తిడి మేరకే అని స్పష్టంగా అర్థం అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలపై ఆర్టీఏ చట్టం ప్రకారం స్పీకర్‌ తన పరిమితిని మించి ఇచ్చారని స్పష్టమైన సమాధానం వచ్చిందన్నారు. దీంట్లో క్విడ్ ప్రోకో జరిగిందని, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తనయుడు వేమూరి ఆదిత్యకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ టెలీ కమ్యూనికేషన్‌కు అప్పగించి 6 గంటలకు రూ.72 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలపై హైకోర్టులో పిటీషన్‌ వేయడం జరిగిందన్నారు. అడ్వాన్స్‌డ్‌ టెలి కమ్యూనికేషన్‌కు అక్రమంగా ఇచ్చారంటూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు 2 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌కు ఆదేశాలు జారీచేసింది. 

విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌ ఆదేశాల మేరకు 2018 చివరకు నామినేషన్‌ బేసిక్‌ మీద అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ ఇవ్వడం జరిగిందనే సమాధానం తనకు అందిందన్నారు. ప్రివిలేజ్‌ కిందకు ప్రత్యక్ష ప్రసారాలు రావని, టెండర్లు పిలిచి ఇవ్వాలని, చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. అయినా సభా హక్కులు, ప్రజా సమస్యలు చర్చిస్తున్నప్పుడు సంధానకర్తగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ నిబంధనలను ఉల్లంఘించి ప్రసారాలను అడ్వాన్స్‌డ్‌ కంపెనీకి ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించిన కంపెనీకి ప్రసారాలు ఇవ్వడంపై సాక్షాధారాలతో సహా న్యాయస్థానికి అందజేశామన్నారు. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు 2 వారాల్లో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిందన్నారు. 

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రజా సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు మైక్‌ కట్‌ చేస్తారు. ప్రతిపక్షం గొంతును నొక్కేయడం కోసం స్పీకర్‌ ఆయన పరిధిని దాటి ప్రసారాలు ఇవ్వడం అన్యాయమన్నారు. గతంలో కూడా స్పీకర్‌ చట్టాల్లో లేకపోయినా ప్రతిపక్ష సభ్యురాలు ఆర్కే రోజాను సంవత్సరం పాటు సభకు రానివ్వకుండా సస్పెండ్‌ చేశారని ధ్వజమెత్తారు. అనేక సందర్భాల్లో స్పీకర్‌ తన పరిధిని దాటాడన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అధికారుల పార్టీ సభ్యులు అసభ్యంగా తిట్టినా ఆ వీడియో బైట్స్‌ బయటకు తీయరు కానీ ప్రతిపక్ష సభ్యులు పొరబాటున మాట జారితే వాటిని పది రకాలుగా చూపిస్తున్నారని, అందుకే ప్రసారాలు అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేసన్‌కు అప్పగించారన్నారు. ఇంటర్‌ చదివిన వ్యక్తిని అసెంబ్లీ సెక్రటరీగా నియమించడం వల్లే ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు చేసే ప్రతీ అవినీతిని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటుందన్నారు. ప్రతిపక్షానికి న్యాయస్థానాలపై అపార గౌరవం ఉందని, అందుకే న్యాయంగా పోరాడుతున్నామన్నారు. 

అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు చట్టాలను కాలరాస్తున్నారని ఆర్కే మండిపడ్డారు. మంత్రులు గంటా, అచ్చెన్నాయుడు, దేవినేని, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర,కేఈ కృష్ణమూర్తి,  స్పీకర్ కోడెలపై ఉన్న కేసుల ఎత్తివేస్తూ జీవోలు విడుదల చేయడం దారుణమన్నారు.  వీళ్లు చేసిన తప్పులకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, అత్యాచార యత్నాలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన , ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని బెదిరించినా, ప్రభుత్వ ఆస్తుల్ని లూటీ చేసిన విషయాలపై వీరికి ప్రత్యక్షంగా సంబంధముందని పోలీసులు కేసులు పెట్టి న్యాయస్థానాల వరకు తీసుకెళ్లారన్నారు. వీరి చేసిన తప్పులకు బాధపడిన కుటుంబాలు ఏమైపోవాలని ప్రశ్నించారు. తన మనుషులు కాబట్టి ఎవరు  ఏమైపోతేనేమి శిక్షలు తీసేస్తున్నానని బాబు జీవోలివ్వడం అన్యాయయమన్నారు.

 భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వకూడని జీవోలు బాబు ఇచ్చి వారిని కాపాడుతుంటే వారి వల్ల అన్యాయమైన కుటుంబాలకు ఏం సమాధానం చెబుతాని నిలదీశారు. ముఖ్యమంత్రే శిక్షలను తప్పిస్తూ కేసులు మాఫీ చేస్తే ఇక  చట్టానికి లోబడి తమ విధులను నిర్వహించిన పోలీస్ అధికారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎందుకని అన్నారు. నా ఇష్టమొచ్చినట్టు చేసుకుంటానన్న ముఖ్యమంత్రి విధానం సరికాదన్నారు.  ఇలాంటి జీవోలివ్వవద్దని గతంలో ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నారు. జీవోలివ్వడమే గాకుండా...కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ నిస్సిగ్గుగా చెప్పడం దారుణమన్నారు. ప్రాధేయపడితే న్యాయమూర్తి మూడు వారాల్లోగా కౌంటర్ వేయాలని చెప్పారని,  అప్పటివరకు ఈ కేసులపై ఎలాంటి వాదనలు జరపవద్దని ఇచ్చిన తీర్పున ప్రజల తరపున స్వాగతిస్తున్నామని ఆర్కే స్పష్టం చేశారు.