స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

6 May, 2016 19:49 IST

హైదరాబాద్) తెలంగాణ వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం టీ ఆర్ ఎస్ లో విలీనం అయినట్లుగా స్పీకర్ మధుసూదనాచారి బులెటిన్ ఇవ్వటం అనైతికం అని, రాజ్యాంగ విరుద్ధం అని వైయస్సార్సీపీ తెలంగాణ విభాగం నాయకులు కేవీ రాఘవరాడ్డి, శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు మరొక పార్టీలో చేరటాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని, వందకు వంద శాతం సభ్యులు వేరొక పార్టీలో చేరినా వారి చర్య రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయానికి ఉన్న రాజ్యాంగబద్ధత ఏమిటో స్పీకరే వెల్లడించాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనం అయినట్లు కాదని, ఇటువంటి అనైతిక చర్యలకు తావివ్వటం అంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం లేకపోవటమే అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.