సమస్యలు పరిష్కరించండి

2 Dec, 2015 19:40 IST
అనంతపురం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  అనంతపురంలో సంక్షేమ హాస్టళ్ల అధికారులు ఆందోళనకు దిగారు. సంక్షేమ హాస్టళ్ల అధికారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు మండిపడ్డారు. పదోన్నతుల విషయంలో అన్యాయానికి గురవుతున్నామని.... 30 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 పదోన్నతి కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సంక్షేమ హాస్టళ్ల అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

ఇతర నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల మాదిరిగా హాస్టళ్ల అధికారులకు 30 రోజులు ఆర్జిత సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అందరు ఉద్యోగుల మాదిరిగా ఎనిమిది గంటలు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రీమెట్రిక్ అంటూ అదనపు సమయం పనిచేయిస్తున్నారన్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్‌లోని సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్‌కి నాయకులు వినతిపత్రం అందజేశారు.