విజయమ్మ ఆరోగ్యం ప్రమాదకరం
24 Aug, 2013 10:44 IST

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో శ్రీమతి విజయమ్మ ఈ నెల 19 న గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టారు. శ్రీమతి విజయమ్మ ఆరోగ్యం బాగా క్షీణించినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ఆమెకు తక్షణం వైద్యచికిత్స అందించకపోతే మెదడు మీద ప్రభావం చూపుతుందని చెప్పారు.
శ్రీమతి విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.55 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. పోలీసు బలగాలు శిబిరంలోకి దూసుకొచ్చాయి. నీరసించిన శ్రీమతి విజయమ్మను తమతో పాటు రావాలని, ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు కోరారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేది లేదని శ్రీమతి విజయమ్మ తేల్చి చెప్పారు. దీక్షా శిబిరంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది.
కనీసం అంబులెన్సును కూడా తీసుకురాని పోలీసులు 1.55 గంటలకు బలవంతంగా శ్రీమతి విజయమ్మను పోలీసు వ్యాన్‌లోనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొందరు నేతలను పోలీసులు వేదికపై నుంచి ఎత్తి పడేశారు. కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని వేదిక పైనుంచి కిందికి తోసేశారు. దీంతో ఆయన కాలికి గాయమైంది.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ శ్రీమతి విజయమ్మ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. 20 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చి ఆమెను ఐసియులోకి తరలించారు. కాగా, ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చింది. మహానేత సతీమణిని అమానుషంగా తరలించిన తీరుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. సీమాంధ్ర బంద్కు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తిచేశారు.