జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరు

16 Sep, 2013 16:00 IST
రాజాం (శ్రీకాకుళం జిల్లా),

16 సెప్టెంబర్ 2013: కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చూస్తూ ఊరుకోరని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిల తెలిపారు. జగనన్న నాయకత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల తరఫున నిలబడి న్యాయం కోసం ఎందాకైనా పోరాటం చేస్తుందని ఆమె మాట ఇచ్చారు. సిఎం కిరణ్, పిసిసి చీఫ్‌ బొత్స, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మన రాష్ట్రంలోని కేంద్ర మంత్రుల్లో ప్రవహించేది రక్తమా లేక మరేదైనానా అని ఆమె ఎద్దేవా చేశారు. ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే.. జగనన్న సిఎం అయిన వెంటనే.. ఆ జీతాలు ‌పువ్వుల్లో పెట్టి అందిస్తారన్నారు. ఉద్యమించిన ఉద్యోగులను గౌరవిస్తూ.. ఒక నెల జీతం బోనస్‌ కూడా చెల్లిస్తుందని జగనన్న తరఫున శ్రీమతి షర్మిల మాట ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభకు హాజరైన అశేష జనప్రవాహాన్ని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

ఉద్యమిస్తున్న ప్రజలు, ఎన్జీవోలు, ఆందోళనకారులపై కిరణ్‌ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెట్టి హింసిస్తోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ధీమాగా చెప్పారు. జగనన్న సిఎం అయిన తరువాత ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తారన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ జీవితాలను పణంగా పెట్టి రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న ఈ పాలకులను మనుషులనాలా? లేక రాక్షసులనాలా? దుయ్యబట్టారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంతగా కళకళలాడిందో అందరికీ తెలిసిందే అని శ్రీమతి షర్మిల అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఆయన అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చారన్నారు. రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత కూడా ఆయనదే అన్నారు. ప్రతి తెలుగువాడూ సంతోషంగా ఉండాలని రాజశేఖరరెడ్డిగారు తపించారని తెలిపారు. ఆయన తపనలోంచి పుట్టినవే అద్భుతమైన పథకాలని చెప్పారు. అంతటి అద్భుతమైన పథకాలను రూపొందించి ప్రజల మీద తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకున్నారన్నారు. ఇంటింటి తలుపు తట్టి మరీ సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారు అని పేర్కొన్నారు. ఎన్నెన్నో గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కూడా ఒక్క చార్జీ కానీ, పన్ను కానీ, ధరలు కానీ పెంచలేదని గుర్తుచేశారు.

మన దురదృష్టం కొద్దీ మహానేత రాజశేఖరరెడ్డిగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. ఇప్పుడున్నది దుర్మార్గమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం అని ఆమె దుయ్యబట్టారు. రాజశేఖరరెడ్డిగారి ప్రతి పథకానికీ తూట్లు పెట్టింది.. ఆయన ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంటు చార్జీలను ఏకంగా రూ. 32 వేల కోట్లు పెంచి ప్రజల రక్తం పిండి మరీ వసూలు చేస్తోందని నిప్పులు చెరిగారు. ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్, వ్యాట్‌ ఇలా అనేక రకాలుగా అడ్డూ అదుపూ లేకుండా పన్నులు పెంచుకుంటూ పోయి పేదల నడ్డి విరుస్తోందన్నారు. తాను వేసిన ఆర్థిక భారంతో కుంగి కుదేలైపోతుంటే చూసి నవ్వుకుంటోందన్నారు.

చేసిన పాపాలు చాలలేదన్నట్టు ఇప్పుడు ఒక తల్లి బిడ్డలుగా మెలిగిన తెలంగాణ- సీమాంధ్రుల మధ్య విభజన చిచ్చు పెట్టిందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ చిచ్చులోనే చలి కాచుకుంటోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్ల కోసం, స్వార్థ రాజకీయాల కోసం, టిఆర్ఎస్‌ను కలుపుకుని అయినా సరే రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కోట్లాది మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడానికి పూనుకుందని దుయ్యబట్టారు.

ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల ఎగువన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు తమ అవసరాలు తీరితేనే గాని నీటిని కిందికి వదలని దుస్థితిని చూస్తున్నామని, మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. ఇప్పుడు వస్తున్న ఆ కొంచెం నీటిని కూడా అడ్డుకుంటే.. సీమాంధ్ర ప్రజలేం కావాలి? రైతులు, పొలాల స్థితి ఏమవుతుందని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. కృష్ణానది నీళ్ళు కిందికి రాకపోతే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా ఆయకట్టు రైతులకు సాగునీటికే కాకుండా కనీసం తాగునీటికి కూడా దిక్కుండదని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌ పార్టీ మధ్యలో వచ్చే రాష్ట్రం గోదావరి నీటిని అడ్డుకుంటే ఆ ప్రాజెక్టును ఏ నీటితో నింపుతుందని ప్రశ్నించారు. శ్రీకాకుంళం నుంచి కుప్పం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడ ఉందన్నారు. మధ్యలో వచ్చే మరో రాష్ట్రం కృష్ణా, గోదావరి నీళ్ళను అడ్డుకుంటే సీమాంధ్ర అంతా ఒక మహా ఎడారి అయిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గడప గడపలోనూ ఆత్మహత్యలు జరుగుతాయి.. గ్రామాలన్నీ స్మశానాలుగా మారిపోతాయని భయం వ్యక్తంచేశారు.

గతంలో మద్రాసును తీసేసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా తీసేసుకుంటమంటున్నారని శ్రీమతి షర్మిల అన్నారు. హైదరాబాద్‌ ఇంతగా అభివృద్ధి చెందడంలో సీమాంధ్రుల పాత్ర లేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో భాగం లేదు వెళ్ళిపోండి అంటున్నారే ఇది న్యాయమా కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. పరిశ్రమలన్నీ, ఉద్యోగాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, రాష్ట్రంలో చదువుకున్న ప్రతి యువకుడూ ఉపాధి కోసం ‌మొట్టమొదట చూసేది హైదరాబాద్ వైపే కాదా అన్నారు. హైదరాబాద్‌ మనది కాదంటే.. చదువుకున్న యువకులంతా ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలని శ్రీమతి షర్మిల నిలదీశారు. వారి మీదే ఆశలు పెట్టుకుని, కష్టపడి చదివించిన తల్లదండ్రులంతా ఏమైపోవాలో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి 60 ఏళ్ళు పడితే కేవలం పదేళ్ళలోనే కొత్త రాజధానిని కట్టుకుని వెళ్ళిపొమ్మనడంలో అర్థం ఉందా? హైదరాబాద్‌ లాంటి రాజధాని కట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందనుకుంటున్నారు? అని నిలదీశారు.

రాష్ట్ర ఆదాయంలో కేవలం హైదరాబాద్‌ నుంచి వచ్చేది సగానికి పైనే ఉందని శ్రీమతి షర్మిల తెలిపారు. ఇంత ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతే సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలెలా ఇవ్వాలి? సంక్షేమ పథకాలెలా అమలు చేయాలి? పక్కా ఇళ్ళ పథకం, పింఛన్లు, చివరికి సబ్సిడీ బియ్యం పథకాన్ని ఏ విధంగా నిర్వహించుకోవాలో కాంగ్రెస్‌ జవాబు చెప్పాలన్నారు. ఒక వైపేమో కృష్ణా, గోదావరి నీళ్ళను ఆపేసుకుంటారట.. ఇంకో వైపేమో హైదరాబాద్‌ను కూడా ఇవ్వరట.. సంక్షేమ పథకాలు నడిపే దారి చూపరట.. కానీ రాష్ట్రాన్ని మాత్రం ముక్కలు చేసేస్తారట. అంటే సీమాంధ్రులు బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకోవాలని మీ ఉద్దేశమా? అని నిప్పులు చెరిగారు.

పోనీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమైనా సమాధానం చెబుతారా అనుకుంటే.. కోట్లాది మందికి ఇంత ఘోర అన్యాయం జరుగుతున్నా ఆయన దిష్టిబొమ్మలా నుంచుని చూస్తున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. మన రాష్ట్రాని కాంగ్రెస్‌ పార్టీ చీల్చబోతున్నట్లు కిరణ్‌రెడ్డికి ఎప్పుడో తెలుసన్నారు. తన పదవి పోతుందని అడ్డు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చి ప్రకటించే వరకూ ఆ విషయాన్ని సిఎం కిరణ్‌ గోప్యంగా ఉంచారని విమర్శించారు. చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి ప్రజలు తనను సమాధానం చెప్పమని ప్రజలు అడిగే ప్రశ్నలను మళ్ళీ ఆయన ప్రజలనే అడిగారంటే.. ఇలాంటి సిఎం నుంచి ఏమి సమాధానం వస్తుందని ప్రశ్నించారు.

కోట్లాది మంది తెలుగువారికి ఇంత అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్‌ బొత్స, శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్ర మంత్రి అయిన కిల్లి కృపారాణి, మరెందరో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. వీళ్ళ ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తమేనా లేక మరింకేదైనానా అని నిప్పులు చెరిగారు. ఏమాత్రం పౌరుషం లేకుండా, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి, ఢిల్లీ దర్బారులో వంగి వంగి సలామ్‌లు చేస్తున్నారే తప్ప ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా? అని నిలదీశారు. వీళ్ళను నాయకులనాలా లేక దుర్మార్గులనాలా? అన్నారు.

ఒక పక్కన పాలకపక్షం ఇంత అధ్వానంగా ఏడిస్తే.. మరో పక్కన మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిలో కూడా ఏ చలనమూ లేదని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారన్నారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని బ్లాంక్‌ చెక్కులాంటి అనుకూలమైన లేఖను ఇచ్చి చంద్రబాబు కూడా ఈ దుర్మార్గంలో ప్రధాన కారకుడే అని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ సాహసం చేయడానికి చంద్రబాబు ఇచ్చిన తెలంగాణ అనుకూల లేఖ, ఆయన పలుకుతున్న మద్దతే కారణం అని నిప్పలు చెరిగారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు మొసలి కన్నీళ్ళు కారుస్తూ.. బస్సు యాత్రలు చేయడం చూస్తే.. హత్య చేసి అదే శవంపై పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఉందని విమర్శించారు.

తెలంగాణకు అనుకూలమని వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం పార్టీలు ఎప్పుడూ మద్దతు చెప్పలేదని, విభజనను కోరలేదని శ్రీమతి షర్మిల తెలిపారు. చంద్రబాబులో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయనలో ఏమాత్రం నిజాయితా మిగిలి ఉన్నా ఇప్పటికైనా ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా చేరాలని సూచించారు. తాను కూడా తెలంగాణకు వ్యతిరేకమే అని చెప్పి కోట్లాది మంది సీమాంధ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చెంపలు వేసుకుని తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. కోట్ల మంది ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేయాలని కోరారు. అప్పటి వరకూ సీమాంధ్రలో చంద్రబాబును, ఆయన పార్టీ వారిని అడుగు పెట్టనివ్వబోమని ప్రజలంతా తరిమి తరిమి కొట్టాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగ చేశారని శ్రీమతి షర్మిల విమర్శించారు. పన్నలు, చార్జీలు పెంచేసి పేదల ఉసురుపోసుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటున్న చంద్రబాబు ఎప్పుడూ.. ఎక్కడా లేని విధంగా పాలకపక్షంతో కుమ్మక్కైపోయారని నిప్పులు చెరిగారు. ఆఖరికి రాష్ట్ర విభజనకు కూడా మద్దతు పలుకుతున్నారంటే.. చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడనాలా? లేక దుర్మార్గుడనాలా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చంద్రబాబు తనకు అధికారం ఇస్తే... రాష్ట్రాన్నే కాదు దేశాన్నే గాడిలో పెడతానంటారని విమర్శించారు. దున్నపోతు సామెతలా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా పని చేయరు... లేకపోయినా చేయరని ఎద్దేవా చేశారు.

కోట్ల మందికి అన్యాయం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ పూనుకుందని శ్రీమతి షర్మిల విమర్శించారు. మరో వైపున ఓట్లు, సీట్లు రావని, క్రెడిట్‌ తనకు రాకుండా పోతుందని కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా నోరు విప్పడంలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టిడిపి కలిపి మన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాయని, తరతరాలు క్షమించని ఘోర అన్యాయం చేస్తున్నాయని అన్నారు.

ఎలాంటి పరిష్కారాలూ చూపించకుండా మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ హఠాత్తుగా సంకేతాలు పంపిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సహా ప్రజా ప్రతినిధులంతా ఒక్కుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలిచిన వైనాన్ని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారి వంతుగా నిరాహార దీక్షలు కూడా చేశారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని, అన్యాయం చేయవద్దని ప్రధాని సహా కేంద్రంలోని వారికి లేఖల మీద లేఖలు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారని చెప్పారు. ఈ రోజు వరకూ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. మరి సీమాంధ్రలోని టిపిని నాయకులు ఎంతమంది రాజీనామాలు చేసి, ప్రజల పక్షాన నిలబడి, ప్రజాక్షేత్రంలో తమ గొంతు విప్పారని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు రాజీనామాలు చేసిన రోజునే సీమాంధ్రలోని కాంగ్రెస్, టిడిపి నాయకులు కూడా చేసి ఉంటే దేశం అంతా మన రాష్ర్టం వైపు తిరిగి చూసి ఉండేదని శ్రీమతి షర్మిల అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగి ఉండేదన్నారు. ఈ విభజన ప్రక్రియ ఆ రోజే ఆగిపోయి ఉండేదన్నారు. కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న కాంగ్రెస్, టిడిపి నాయకులకు ప్రజల కంటే పదవే ముఖ్యమని నిరూపించుకున్నారని అన్నారు.

ఏ ప్రాంతానికీ అన్యాయం జరగడానికి వీల్లేదని.. కన్న తండ్రిలా ఆలోచన చేయాలని.. మీ ఆలోచన విధానం ఎలా ఉందో.. మీ ఉద్దేశం ఏమిటో.. అందర్నీ పిలిచి చర్చించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందు నుంచీ పదే పదే చెబుతూనే ఉందని శ్రీమతి షర్మిల తెలిపారు. కాని ఇది ప్రజాస్వామ్య దేశమని కూడా మరిచిపోయి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిందని ఆమె దుయ్యబట్టారు. న్యాయం చేయకపోతే.. న్యాయం చేసే సత్తా లేకపోతే విభజించే హక్కు మీకెక్కడిదని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. న్యాయం చేయడం మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని యధాతథంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. న్యాయం చేయడం కాంగ్రెస్‌ పార్టీకి చేతకాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అన్నారు.

ప్రసంగం చివరిలో 'జై సమైక్యాంధ్ర'.. 'జైజై సమైక్యాంధ్ర'.. 'జై సమైక్యాంధ్ర'.. 'జైజై సమైక్యాంధ్ర'.. 'జోహార్‌ వైయస్ఆర్'.. 'జై జగన్‌'  అంటూ శ్రీమతి షర్మిల నినాదాలు చేశారు.