పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం

24 Mar, 2014 15:29 IST
గుంటూరు :

జగ‌నన్న సీఎం అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని, ప్రతి పేదవాడి సంక్షేమమే జగనన్న లక్ష్యమని శ్రీమతి షర్మిల అన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో ‌తాను చెప్పనవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన అన్నివిధాలుగా అండగా నిలబడ్డారన్నారు. రైతులకు పెట్టుబడులు తగ్గించి రాబడులు పెరిగేలా చేశారని గుర్తుచేశారు. పంటకు మద్దతు ధర పెంచారన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీళ్ళివ్వాలని జలయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారంనాడు శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లా బేతపూడి, వెదుళ్లపల్లి, బాపట్ల, పొన్నూరు, చెరుకుపల్లి, నగరంలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు.

వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని‌ మహానేత వైయస్ఆర్ మాట ఇచ్చి, మగాడిలాగా మాటను నిలబెట్టుకుని చూపించారని శ్రీమతి షర్మిల అన్నారు. రైతులకు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరె‌న్సు అన్నీ అందజేశారన్నారు. 'ఒకసారి రైతు రుణాల మీద ఉన్న వడ్డీనీ మాఫీ చేశారు. మరొకసారి రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు’ అని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. అలాంటి సువర్ణయుగం మళ్లీ శ్రీ జగనన్నతోనే సాధ్యం అని శ్రీమతి షర్మిల అన్నారు.

ఏ పథకాన్నైనా వైయస్ఆర్ అద్భుతంగా అమలు చేశారు‌:
రాజశేఖరరెడ్డికి ముందు చంద్రబాబు రైతులు, మహిళలకు రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత పావలా వడ్డీకే రుణాలిస్తే బ్యాంకుల ముఖం చూడని మహిళలు కూడా బ్యాంకుల వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడ్డారన్నారు. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబ‌ర్సుమెంటుతో రాష్ట్రంలో లక్షల మంది పేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకుని లక్షణంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు.

వైయస్ పథకాలను కాపీ కొడుతున్న బాబు :
'రాజశేఖరరెడ్డి ప్రతి పథకానికీ జగనన్న సీఎం అయ్యాక జీవం పోస్తారని మేం హామీ ఇస్తున్నాం. అలా చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకని రాజశేఖరరెడ్డి చేసిన పథకాలనే తానూ చేస్తానని చెప్పుకొంటూ తిరుగుతున్నారాయన. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తే... అప్పుడేమో ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ తరం కాదని హేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు తాను కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చెబుతు‌న్నారు. రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు చెయ్యెత్తి నేనూ రుణ మాఫీ చేస్తానంటున్నారు. నిజంగానే ఈయనకు రుణమాఫీ చేసే మనసే ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే దానికి సమాధానం లేదు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ చేస్తే, ఇప్పుడు తాను కూడా ఉచితంగా వైద్యం చేస్తానని చెబుతున్నాడు చంద్రబాబు. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ చేస్తే ఇప్పుడు తాను కూడా ఉచిత విద్య‌ అందిస్తానని చెబుతున్నారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే... పులి పులే’ అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

చిరంజీవీ ఆ 70 కోట్లు ఎవరివి ?:
'చిరంజీవి బంధువు ఇంట్లో రూ.70 కోట్లు దొరికాయి. ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేసిన 70 లక్షల మంది అభిమానాన్ని వెలకట్టి అమ్ముకుంటే రూ. 70 కోట్లు వచ్చి చిరంజీవిగారి ఇంట్లో చేరాయా? ఈ చిరంజీవి‌ శ్రీ జగన్ అవినీతి గురించి మాట్లాడుతారా? ఏ ఆధారం చూపకుండానే 16 నెలలు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టింది సీబీఐ. మరి చిరంజీవి సొంత వారింట్లో రూ. 70 కోట్లు సీబీఐ కంటికి కనిపించలేదా? చిరంజీవి మీద ఎందుకు విచారణ జరుపలేదు? ఆయనను ఎందుకు జైలులో పెట్టలేద?ని నిలదీశారు. చిరంజీవేదో పెద్ద ఉత్తముడైనట్లు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అవినీతిపరుడని నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీని పల్లెత్తు మాటంటే ఏం పాపం చుట్టుకుంటుందో అన్నట్లు, ఈయన భక్తిని తెలుగుతల్లికి కాకుండా ఇటలీ తల్లికి చాటుకున్నాడని దుమ్మెత్తిపోశారు. సీమాంధ్రలో చిరంజీవి అడుగు పెడితే, ఓట్లు అడిగితే ప్రజలంతా కాలర్ పట్టుకుని నిలదీయా‌లని ప్రజలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.