ఇంగితం మరిచి విభజనకు మద్దతు

10 Sep, 2013 12:10 IST
మార్కాపురం (ప్రకాశం జిల్లా),

10 సెప్టెంబర్ 2013:  రాజశేఖరరెడ్డిగారు బ్రతికి ఉండగా అన్నపూర్ణ అనిపించుకున్న మన రాష్ట్రం ఆయన వెళ్ళిపోయిన నాలుగేళ్ళలోనే కుప్పలు చింపిన విస్తరిలా అయిపోయింది. ఆయన రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన పథకాలన్నింటికీ తూట్లు పొడిచింది. అన్నదమ్ముల్లాంటి తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టింది.

కర్నాటక అవసరాలు తీరిన తరువాతే తప్ప ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి నీటికి కిందికి వదలని దుస్థితిని చూస్తున్నాం. ఇప్పటికి కింద ఉన్న మన రాష్ట్రానికి కృష్ణా నది నీటిని వదలడంలేదు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం లాంటి డ్యామ్‌లకు నీళ్ళెక్కడి నుంచి వస్తాయి? పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తామంటున్నారు. దానికి నీళ్ళెక్కడి నుంచి తెస్తారో కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలన్నారు. కృష్ణా నది దిగువన ఉన్న సీమాంధ్ర గ్రామాలు ఎడారిగా మారిపోవా అని ఆందోళన వ్యక్తంచేశారు. గోదావరి నుంచి నీళ్ళను కృష్ణా నదిలోకి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు.

గతంలో మద్రాసును తీసేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా తీసేసుకుంటారట. చదువుకున్న వారి పరిస్థితి ఏమి కావాలి. పదేళ్ళలో హైదరాబాద్‌ లాంటి రాజధానిని కట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందనుకున్నారని కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. రాష్ట్ర ఆదాయంలో సగం వచ్చే హైదరాబాద్‌ను తీసుకుంటే సీమాంధ్రలో జీతాలెలా ఇవ్వాలి? సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.

ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడడంలేదు. చంద్రబాబు పలికిన మద్దతు కారణంగానే విభజన ప్రక్రియకు కాంగ్రెస్‌ పార్టీ సాహసం చేసిందన్నారు. గతంలో ఎఫ్‌డిఐలపై బిల్లు సమయంలో కూడా చంద్రబాబు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర ప్రజలను పీడిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే నిస్సిగ్గుగా తన ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ దాన్ని పడిపోకుండా కాపాడారని దుయ్యబట్టారు.

ఐఎంజి మొదలు తన మీద ఉన్న కేసులపై విచారణ జరగకుండా చీకట్లో చిదంబరాన్ని కలిసి చంద్రబాబు మేనేజ్‌ చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి దానిలోనే కలిపేసిన చిరంజీవి పార్టీకి చంద్రబాబుకు తేడా లేదన్నారు.

వైయస్ఆర్‌ మరణించారన్న ఇంగితం కూడా లేకుండా లక్ష కోట్ల అవినీతి అని మాట్లాడుతున్నారంటే ఆయనకు అసలు మానవత్వం ఉందా? జగనన్న దోషి అని ఏ కోర్టూ చెప్పలేదు. చంద్రబాబు నిర్దోషి అనీ చెప్పలేదు. చిరంజీవి అమాయకుడని, బొత్స సత్యనారాయణ లిక్కర్‌ మాఫియా డాన్‌ కాదని ఏ కోర్టూ చెప్పలేదన్నారు.

ఒకరిని హత్యచేసి ఆ శవంపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన చందంగా ఉందని చంద్రబాబు బస్సు యాత్ర అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు ఐదు పార్టీలు ఒప్పుకుంటే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌, ఎంఐఎం, సిపిఎం ఒప్పుకోలేదన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు తప్పు తెలుసుకుని, చెంపలేసుకుని మూడు పార్టీలతో పాటు నాలుగవ పార్టీగా చేరాలన్నారు.

న్యాయం చేసే సత్తా లేకపోతే విభజించే హక్కు కాంగ్రెస్‌కు ఎక్కడిదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎప్పుడూ ఒక్కటే మాట చెబుతోందన్నారు. న్యాయం చేసే బుద్ధి కాంగ్రెస్‌కు లేదు కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. జగనన్న వస్తారని, మనందరినీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని భరోసా ఇచ్చారు. అప్పటి వరకూ జగనన్నను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర, జై జగన్, జైజై వైయస్ఆర్‌ ంటూ శ్రీమతి షర్మిల నినాదాలు చేశారు.