జగన్మోహన్‌రెడ్డితో షర్మిల ములాకాత్
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,112 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు స్వయంగా తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి షర్మిల.. ఆ వివరాలను తన సోదరుడు, పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి వివరించారు. సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకున్న ఆమె, ములాకాత్ ద్వారా తన అన్న జగనన్నను కలుసుకున్నారు. తమ కుటుంబం పట్ల రాష్ట్రం నలుమూలలా అశేష జనాభిమానం ఎలా ఉందో వివరించారు.
అంతకు ముందు చరిత్రాత్మాక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న శ్రీమతి షర్మిలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు, తన మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖపట్నం నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు.
సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళగా మహానేత రాజన్న తనయ శ్రీమతి షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేసిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2013 ఆగస్టు 4న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యాత్రను ముగించారు.