ఎన్నిక‌ల కోస‌మే యువ‌నేస్తం

5 Oct, 2018 16:13 IST


కర్నూలు: యువనేస్తం పేరుతో మోసం చెయ్యడమే రాష్ట్రంలో దగాకోరు పాలన నడుస్తుందనడానికి నిదర్శనమని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. ఎన్నికల స్టంట్‌ కోసం నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నార‌ని, అది కూడా రూ.1000 చెల్లించడం అనేది నిరుద్యోగులను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..కేవలం 2 లక్షల మంది నిరుద్యోగులే అర్హులని లోకేష్‌ అనడం నిరుద్యోగులను అవమానపర్చడమే అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి అని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వేల పరిశ్రమలు తెచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెప్పడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల్ని రుణామాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారు..ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కర్నూలులో జలదోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీని ఆపకపోతే పోతిరెడ్డిపాడును రైతులతో ముట్టడిస్తామని హెచ్చరించారు.