షర్మిలను పంపిస్తున్నా అక్కున చేర్చుకోండి
18 Oct, 2012 16:02 IST
ఇడుపులపాయ, 18 అక్టోబర్ 2012: 'నా బిడ్డ జగన్‌బాబును ఆదరించినట్లుగానే మరో బిడ్డ షర్మిలను కూడా ఆదరించి, అక్కున చేర్చుకోండ'ని వైయస్‌ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక బిడ్డ జైలులో ఉంటే మరో బిడ్డను మీ ముందుకు పంపిస్తున్నానంటూ ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. ప్రజలపై కొండంత నమ్మకంతో తన బిడ్డ షర్మిలను ప్రజా క్షేత్రంలోకి పంపుతున్నానని విజయమ్మ అన్నారు. కాంగ్రెస్, టిడిపి, సిబిఐ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలంతా మా కుటుంబానికి అండదండలుగా ఉన్నారన్న భరోసా తమను ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నదన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ షర్మిల చేయనున్న 'మరో ప్రజాప్రస్థానం' సుదీర్ఘ పాదయాత్రను గురువారం ఉదయం ప్రారంభించే ముందు విజయమ్మ ప్రసంగించారు. షర్మిల పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ఇడుపులపాయ వేదికగా సాగిన బహిరంగ సభలో ఆమె గురువారం ఉద్వేగభరితంగా మాట్లాడారు.
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి కుటుంబానికీ ధన్యవాదాలు తెలుపుతూ విజయమ్మ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తొమ్మిదేళ్ళ క్రితం వైయస్ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆ రోజున పెద్దాయన పాదయాత్ర చేసే నాటికి టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి దురవస్థలను ప్రజలు ఎదుర్కొంటున్నారో ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలోనూ అవే దుస్థితులు నెలకొన్నాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు టిడిపి అధికారంలో ఉంటే ఇప్పుడు టిడిపి చేయూతతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చెలాయిస్తోందని విమర్శించారు.
ఆ రోజున ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం నిర్వహించి మేల్కొలిపారని విజయమ్మ అన్నారు. అదే విధంగా ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దానికి వత్తాసుగా నిలుస్తున్న టిడిపి కుమ్మక్కు రాజకీయాలను రాష్ట్ర ప్రజలకు వివరించి, వారికి మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకే షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ మహానేత కొడుకుగా కష్టాలు, కడగండ్లతో అల్లాడుతున్న రైతుల పక్షాన నిలబడేందుకే జగన్మోహన్‌రెడ్డి ముందుకు వచ్చారని విజయమ్మ అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల కడగండ్ల తీర్చేందుకు నిత్యం వారి మధ్యే ఉండాలన్న జగన్ తాను స్వయంగా మీ మధ్యకు వచ్చే అవకాశం లేనందు వల్లే తన చెల్లి షర్మిలను మీ ముందుకు పంపిస్తున్నాడని తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్యలపైనా జగన్ స్పందించినట్లు విజయమ్మ పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే దీక్షలు, ఆందోళనలు చేశాడని, మీలో ఒకడయ్యాడని అన్నారు. జనం సమస్యల పరిష్కారం కోసమే పరితపిస్తున్న జగన్‌ను కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై జైలుకు పంపించి సుమారు 145 రోజులయిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ బయటికి రావడానికి మరో రెండు మూడు నెలలు పట్టవచ్చు. తాను బయటికి వచ్చే వరకూ మన కుటుంబ సభ్యులు నిరంతరం ప్రజల మధ్యే ఉండాలని, వారి కష్టాల్లో అండగా నిలుస్తామని భరోసా ఇవ్వాలని కోరాడు. పాదయాత్ర చేసేందుకు తాను ప్రయత్నం చేస్తానని, అయితే, ఆరోగ్య రీత్యా ఎక్కువ కాలం నడవడం సాధ్యం కాదేమో అని తాను చెప్పినప్పుడు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తాను చేస్తానంటూ షర్మిల ముందుకు వచ్చినట్లు విజయమ్మ వివరించారు.
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కర్ణటక ఆల్మట్టి కట్టింది:
ఆనాడు అధికార పీఠంపై ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై ఆల్మట్టి డ్యాం కట్టిందని విజయమ్మ విమర్శించారు. ఆల్మట్టి డ్యామ్ వద్ద నీరు పొంగి పొరిలితే గాని దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ జలయజ్ఞం నిర్వహించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే చంద్రబాబు ఇంకుడుగుంతలు తవ్వి ఊరుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలను వైయస్ అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం యూజర్ చార్జీలు వేసి రోగులను ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోజునా ప్రజల గురించి ఆలోచించని చంద్రబాబు ఈ రోజున తనకు అధికారం ఇస్తే ఏదో చేస్తానంటూ కల్లబొల్లి మాటలతో ప్రజల ముందుకు వచ్చారని విమర్శించారు. నిలువెల్లా అబద్ధాలు మాత్రమే చెప్పే చంద్రబాబు మాటలను నమ్మొద్దని విజయమ్మ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధానిని చేశానని, రాష్ట్రపతిని చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ రోజుల్లో రైతుల రుణాలు మాఫీ ఎందుకు చేయించలేదని విజయమ్మ నిలదీశారు. వడ్డీ లేని రుణాలను ఎందుకు ఇప్పించలేదని దెప్పిపొడిచారు. మహిళలను చంద్రబాబు గుర్రాలతో తొక్కించి, హింసించిన విషయం మర్చిపోలేమన్నారు. బాధల్లో ఉన్న ప్రజలను చంద్రబాబు ఏ ఒక్కరోజునైనా పరామర్శించారా? అని విజయయ్మ నిలదీశారు. రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.25 చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి టిడిపిని అధికారంలోకి ఎన్టీఆర్ తీసుకువస్తే దాన్ని రద్దు చేసిన పెద్దమనిషి చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. బెల్టు షాపులు తెరిపించింది చంద్రబాబు అని గుర్తు చేశారు. మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. రూ. 50కే హార్స్ పవర్ విద్యుత్‌ను రూ. 600 చేసింది చంద్రబాబే అన్నారు.
ప్రజల కష్టాలు తెలుసు గనుకే వైయస్ రాజశేఖరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ తెచ్చారు. ఉన్నవారు లేనివారు అనే భేదం లేకుండా అందరికీ కార్పొరేట్ వైద్య సదుపాయాన్ని వైయస్ కల్పించార్నారు. విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లించారని విజయమ్మ గుర్తుచేశారు. మైనారిటీలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత వైయస్‌దే అన్నారు. అన్ని వర్గాల వృద్ధులకు నెలనెలా పింఛన్లు సంతృప్త స్థాయిలో అందించారని, వికలాంగులకు నెలకు 500 రూపాయలు పింఛన్ అందించారన్నారు. అవసరం ఉన్న వారికి ఇళ్ళు కట్టించారన్నారు.
తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న వైయస్ ఏనాడూ ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదని అన్నారు. ఒక్క రాష్ట్రానికే రుణ మాఫీ ఎలా అమలు చేయాలని ప్రధాని అడిగినప్పుడు మన రాష్ట్రంలోని 16 జిల్లాలతో పాటు దేశంలోని మరెన్నో రాష్ట్రాల్లో కూడా రుణ మాఫీ పథకం అమలు చేయించేలా చేసి వైయస్ ఆదర్శంగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. మన రాష్ట్రంలోనే 12 వేల కోట్ల రుణాలు మాఫీ చేయించిన ఘనత వైయస్‌ది అని గుర్తుచేశారు. రైతులకు తొమ్మిది గంటలపాలు ఉచిత విద్యుత్ అందించారని అన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో చంద్రబాబు ధాన్యానికి మద్దతు ధర కేవలం 100 రూపాయలు పెంచితే వైయస్ 1000 రూపాయలు పెంచారన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం పల్లెల్లో రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితి నెలకొన్నదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లలో నీళ్ళున్నా వాటిని పైకి తీసుకునేందుకు విద్యుత్ లేక నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కరవు వచ్చిన నష్ట పరిహారాన్ని చెల్లించకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని విజయమ్మ పేర్కొన్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా మీరంతా నా బిడ్డను అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నానని ఆమె అన్నారు. జగన్ వచ్చే వరకూ మీరు మాకు అండగా ఉండాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.