షర్మిలకు బ్రహ్మరథం పట్టిన ముస్లిం మహిళలు

3 Jun, 2013 11:41 IST
నిడదవోలు (ప.గో.జిల్లా) :

సుదీర్ఘ, చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డ శ్రీమతి షర్మిలకు నిడదవోలు నియోజకవర్గంలోని మహిళలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేశారు. నిడదవోలు మండలం సమమిశ్రగూడెంలో శ్రీమతి షర్మిల ఆదివారం చేసిన పాదయాత్రలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

నిడదవోలు నియోజకవర్గంలోని సమిశ్రగూడెంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నారు. శ్రీమతి షర్మిల రాక కోసం సుమారు రెండు గంటల పాటు వారు వేచి ఉన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి, వారి సంక్షేమానికి కృషిచేసిన‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ‌తనయను కలవాలని, మాట్లాడాలని వారంతా ఎదురుచూశారు. పాదయాత్ర మార్గంలో శ్రీమతి షర్మిల అక్కడకు చేరుకుని వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. దీనితో షకీలా అనే మహిళ కళ్లలో ఆనందభాష్పాలు చెమర్చాయి. ‘నాన్నగారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా నేను గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు మరో జన్మనిచ్చిన మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌‌ను ఎప్పటికీ మరువలేను’ అంటూ ‌ఆమె శ్రీమతి షర్మిలను అనుసరించింది.

పాదయాత్రలో విశేషాలు :
- సమిశ్రగూడానికి చెందిన సీమా సిరాజ్ అనే ముస్లిం మహిళ తెలుగు ఖురా‌న్‌ను శ్రీమతి షర్మిలకు బహూకరించారు.
- కలవచర్లలో జీడిగుంట మాణిక్యం అనే మహిళ పసుపు - కుంకుమలు, పట్టుచీరను శ్రీమతి షర్మిలకు బహూకరించింది.
- శ్రీ వైయస్ జగ‌న్, ‌శ్రీమతి షర్మిల, నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ చిత్రాలతో ఉన్న టీషర్టులను ధరించిన యువత శ్రీమతి షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు.
- పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద‌ శ్రీమతి షర్మిలపై పూల వర్షం కురిపించి మహిళలు స్వాగతం పలికారు.
- తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి రప్పించిన గారడీ కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
- పొడవైన పార్టీ జెండాలు చేతపట్టిన యువకుల బృందం శ్రీమతి షర్మిల ముందు కవాతుగా నడిచింది.