సీమ విలన్ చంద్రబాబు..!

29 Oct, 2015 16:43 IST
పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే పట్టదా..!
పబ్లిసిటీ మాని రైతుల గురించి ఆలోచించు..!

చంద్రబాబుకు ఎంతసేపు పబ్లిసీటీ యావ, విదేశాలు తిరగడం తప్ప...రైతులను కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తుంటే... చంద్రబాబు ఏనాడు ఒక్క మీటింగ్ కూడా పెట్టకపోవడం దుర్మార్గమన్నారు. కన్నబిడ్డల్లా పెంచిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పబ్లిసిటీకి పెట్టే దుబారా ఖర్చులు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  

విన్యాసాలు చేశారు..మరి నీళ్లేవి..!
శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదలవద్దని గొంతు చించుకొని అరిచినా పట్టించుకోలేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ 17.7 టీఎంసీలు కిందకు వదలాలని చూడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నధుల అనుసంధానం అయ్యిందని, పట్టిసీమ పూర్తిచేస్తామని చెప్పులేసుకొని పూజలు చేసిన చంద్రబాబు.. పసుపుకుంకుమ చల్లి హారతులిచ్చి విన్యాసాలు చేసినమంత్రులు...పట్టిసీమ పూర్తయితే రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి నీటిని ఎందుకు వదులుతున్నారని ప్రశ్నిస్తే ఏనాడు సమాధానం ఇవ్వలేదన్నారు. 

సీమ విలన్..!
కేసుల మాఫీ కోసం, అవినీతి దందా కోసం దేశాలు తిరిగి అందరినీ ఆహ్వానించిన చంద్రబాబు...నీటికోసం పక్కనున్న కర్నాటకకు ఏనాడైనా లేఖ రాశారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం రాయలసీమపై వివక్ష చూపుతున్నారని ఫైరయ్యారు.  రాయలసీమ గడ్డపైన పుట్టి ప్రజలను అన్యాయం చేస్తున్న విలన్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబేనని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.