ఎస్సీ, ఎస్టీ నిధుల కోత ఉండదు : సీఎం

25 Aug, 2012 04:37 IST

హైదరాబాద్­, 25 ఆగస్టు 2012 : రాష్ట్రంలో రోజురోజుకూ చేజారిపోతున్న ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్­ పార్టీ తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్­కుమార్­రెడ్డి శనివారం ఉదయం ఎస్సీ, ఎస్టీలపై ఎనలేని ప్రేమ ఒలకబోశారు. షెడ్యూల్­ కులాలు, తరగతుల అభివృద్ధి కోసం ఖర్చు చేసే నిధుల్లో ఇక నుంచి కోత విధించబోమని ప్రకటించారు. ఆ నిధులను పూర్తిగా ఖర్చుచేయని మాట వాస్తవమే అని అంగీకరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్­ప్లాన్­ కోసం కేటాయించిన 2 వేల కోట్ల రూపాయలు మిగిలిపోయాయని ఒప్పుకున్నారు. అభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీలకు భాగస్వామ్యం ఉండాలన్నది తమ ప్రభుత్వ అభిమతం అన్నారు. సబ్­ ప్లాన్­ నిధులను కచ్చితంగా చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ నాయకత్వంలో ఏర్పాటైన కేబినెట్­ సబ్­ కమిటీ శనివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్­కుమార్­రెడ్డికి నివేదికను అందజేసింది. ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఈ నివేదికను సమర్పించింది. ఉప ప్రణాళికపై కమిటీ వేయాలని సబ్­ కమిటీ నివేదికలో సూచించింది. ఎస్సీ, ఎస్టీ సబ్­ప్లాన్­ నిధులను పూర్తిగా వినియోగించాలని పేర్కొంది. పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు మరికొంత గడువు కావాలని సబ్ కమిటీ కోరినట్లు సమాచారం.

క్షేత్ర స్థాయిలో పనులు కచ్చితంగా జరగాలంటే సరైన నిఘా ఎంతో అవసరం అని కిరణ్­కుమార్­రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాల కో్సమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం చేయలేదని వివరణ ఇవ్కడం కొసమెరుపు.