పథకాలన్నీ పచ్చచొక్కాలకేనా ?
6 Feb, 2017 18:53 IST
బిట్రగుంట : టీడీపీ హయాంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కేవలం పచ్చచొక్కాలకు మాత్రమే అందుతున్నాయని వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు అన్నారు. సామాజిక పింఛన్‌లు, రాయితీ రుణాల పంపిణీ ప్రక్రియే ఇందుకు నిదర్శనమని అన్నారు. స్థానిక వైయస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో పెన్షన్‌లు, సబ్సిడీ రుణాల పంపిణీలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అర్హత లేకున్నా పింఛన్‌లు, రుణాలన్నీ జన్మభూమి కమిటీ ప్రతినిధులు కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ కార్యకర్తలే పంచుకున్నారని ఆరోపించారు. పింఛన్‌ల మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనంపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించగా జీవో నంబరు 135 వచ్చిందని, ఈజీవో ప్రకారం పంచాయతీ స్థాయిలో ఎంపిక చేసిన జాబితాను ఎంపీడీవో కార్యాలయానికి పంపాలన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన కమిటీ తుది జాబితా ఖరారు చేసిన తరువాతే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. బోగోలులో మాత్రం ఎంపీపీ దృష్టికి తీసుకురాకుండానే జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన జాబితాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని ఆరోపించారు. అలాగే సబ్సిడీ రుణాలకు సంబంధించి జన్మభూమి కమిటీ సభ్యుల బంధువులు, టీడీపీ కార్యకర్తలే పంచుకున్నారని, కమీషన్లకు కక్కుర్తిపడి గ్రామాల్లో లేని వారికి కూడా మంజూరు చేశారని ఆరోపించారు. బోగోలులో వైయస్సార్‌సీపీ ఆధిక్యత ఉందనే కారణంతో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు మండలంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అందులో భాగంగానే వైఎస్సార్ హయాంలో మంజూరైన సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్, డీఎం ఛానల్ పనులు కూడా ముందుకు సాగనివ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్రి సులోచనమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు బాపట్ల కామేశ్వరి, ఎంపీటీసీ సభ్యులు మద్దిబోయిన పద్మ, మేకల శ్రీనివాసులు, సీనియర్ నాయకులు తూపిరి పెంచలయ్య, తుమ్మల రమణయ్య, పర్రి అంకులయ్య, బాపట్ల వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.