దోపిడీ సుస్ప‌ష్టం

26 Jun, 2016 16:30 IST
చెన్నై: స‌దావ‌ర్తి స‌త్రం భూముల కుంభ‌కోణం మీద ఏర్పాటైన నిజ నిర్ధార‌ణ క‌మిటీ త‌మిళ‌నాడులోని సంబంధిత ప్రాంతంలో ప‌ర్య‌టించింది. మాజీమంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నేతృత్వంలో ఏర్పాటైన క‌మిటీలో కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, పార్టీ అధ్య‌క్షులు ఉన్నారు. 
 సదావర్తి సత్రం భూములను టీడీపీ నేతలు అక్రమంగా కొట్టేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సదావర్తి సత్రం భూములపై నిజనిర్ధారణ కమిటీ నివేదికను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అందజేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ధర్మాన చెప్పారు.
 ఇంత జరిగినా ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సత్రం భూముల అమ్మకాల్లో లోకేశ్ కు ప్రమేయం ఉందా అని ప్రశ్నించారు. వెయ్యి కోట్లకు పైగా దోపిడికి జరిగిన విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. సదావర్తి సత్రం పరిధిలో ప్రభుత్వ ధర ఎకరాకు రూ.6.5కోట్లు ఉంటే మీరు ఎకరాకు రూ.27లక్షలకే ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 
సత్రం భూముల వేలాన్ని రద్దు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని అన్నారు. ఈ వేలాన్ని రద్దు చేయాలని ఇప్పటికే అందరూ డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు.ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి వెంటనే స్పందించి సత్రం భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సత్రం భూములపై జాతీయ స్థాయిలో పోరాటాన్ని కొనసాగిస్తామని ధర్మాన చెప్పారు.