రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది: షర్మిల

10 Nov, 2012 13:39 IST
రాతన (కర్నూలు జిల్లా) 10 నవంబర్‌ 2012: మన రాష్ట్రంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, ప్రజల కష్టాలు తీరుతాయని షర్మిల హామీ ఇచ్చారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె శనివారం మధ్యాహ్నం రాతన చేరుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాతన గ్రామ మహిళలు షర్మిల ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పింఛన్లు అందటం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్ల పరిమితిని తగ్గించిన విషయాన్ని ఆమెకు విన్నవించారు.

వారి బాధలు శ్రద్ధగా విన్న షర్మిల స్పందిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మళ్లీ వైయస్‌ పాలన వస్తుందని భరోసా ఇచ్చారు. శనివారంనాటి పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మద్దాల రాజేష్‌ కుమార్‌, కోట్ల హరిచక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.

అంతకు ముందు శనివారం ఉదయం తుగ్గలిలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల రైతులను కలుసుకున్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు తమ సమస్యలను పరిష్కరించేవారని షర్మిలకు రైతులు చెప్పారు. ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయడంలేదని రైతులు తెలిపారు. ఇప్పటి ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్‌ చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పావలా వడ్డీ రుణాలకు ఇప్పుడు రెండు పాయలు వసూలు చేస్తున్నారని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, తాగు నీరు లేక తాము కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తోందని విలపించారు.