రాజన్న రాజ్యం వస్తే పింఛన్లు పెరుగుతాయి
పెద్దపల్లి (మహబుబ్ నగర్ జిల్లా): రాష్ట్రంలో రాజన్న రాజ్యం రాగానే పింఛన్లు పెంచుతామని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాలనలో వృద్ధులకు కేవలం 75 రూపాయలు పింఛను మాత్రమే ఇచ్చారని, వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పింఛను మొత్తాన్ని 200 రూపాయలకు పెంచారని అన్నారు. అలాగే వికలాంగుల పింఛన్లు కూడా 700 రూపాయలకు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఆరో రోజు పాదయాత్రను ప్రారంభించిన షర్మిల మల్దకల్ మండలంలోని పెద్దపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. త్వరలోనే జగనన్న జైలు నుంచి బయటకు వస్తారని, జగనన్న ముఖ్యమంత్రి అయితే అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు ఇస్తారని అన్నారు. అంతేకాకుండా వితంతువుల పింఛన్‌ను 750 రూపాయలకు, వికలాంగుల పింఛన్‌ను 1,000 రూపాయలకు పెంచుతారని షర్మిల హామీ ఇచ్చారు.
గడచిన మూడేళ్ల కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు పెంచిన పాపాన పోలేదని షర్మిల దుయ్యబట్టారు. పింఛన్లు పెంచక పోగా ఉన్న వారిని అకారణంగా జాబితాల నుంచి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అండదండలు, ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయితే అన్ని సమస్యలు తొలగిపోతాయని అన్నారు.