రాజన్న ముద్రను చెరపలేరెవరు
ప్రజల గుండెల్లో వైయస్ఆర్ ముద్రను చెరపడం ఎవరి తరమూ కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి యస్.వి.మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. మరో ప్రజాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగరపాలక సంస్థ పరిధిలో రెండు వేల మంది నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇచ్చారనీ, ప్రస్తుత ప్రభుత్వం ఆయా కాలనీలలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదనీ విమర్శించారు. 2007లో వై.యస్. వరద రక్షణ గోడ నిర్మాణానికి రూ.270 కోట్లు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంతో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. వైయస్ కుటుంబానికి లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై వేధిస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైయస్‌ఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరపలేరని అన్నారు.