ప్రజా సంక్షేమం జగన్‌తోనే సాధ్యం: ఉప్పునూతల

28 Oct, 2012 16:50 IST
ఆలేరు:

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు   జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి స్పష్టంచేశారు.  ఆలేరులోని ఆరుట్ల కమలాదేవి భవనంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా జగన్‌ వైపే ఉన్నారనీ, భవిష్యత్తు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. రామన్నపేట, ఆలేరు నియోజకవర్గాల్లో రోడ్లు, పాఠశాలలు నిర్మించి అభివృద్ధి చేశాననీ, ఏనాడు పదవులు ఆశించలేదనీ, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేశాననీ ఆయన వివరించారు. ఆలేరులో బీసీకి టికెట్ ఇవ్వాలని వైయస్ఆర్‌ను ఒప్పించి గెలిపించాననీ, తనను ఉపయోగించుకుని పదవులు పొందిన వారు నేడు తననే విమర్శించే స్థాయికి ఎదిగారనీ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసిన విధంగానే జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ను పటిష్టంచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహానేత పాలన తిరిగి రావాలంటే వైయస్ జగన్‌ సీఎం కావాలన్నారు. ఈ సందర్భంగా శర్భణాపురం గ్రామానికి చెందిన సాగర్ ఆధ్వర్యంలో ఉప్పునూతల సమక్షంలో 200 మంది పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిం చారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆరుట్ల కమలాదేవి భవనం వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రజల హృదయాల్లో వైయస్ పదిలం:  కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఫొటో కనిపించకుండా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజల హృదయాల నుంచి ఆయన స్థానాన్ని చెరిపేయడం ఎవరి తరమూ కాదని ఉప్పునూతల అభిప్రాయపడ్డారు. ఆలేరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయనీ, ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమనీ  పేర్కొన్నారు. వైయస్ఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి న్యాయం జరిగిందన్నారు. అందువల్లే ఆయన కుటుంబానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్‌లకు గౌరవం లేదని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఒక్కరు కూడా గెలవలేరన్నారు.