ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్లే దుర్ఘ‌ట‌న‌

14 Jul, 2015 13:54 IST
హైద‌రాబాద్‌ : గోదావ‌రి పుష్క‌రాల్లో ఘోర దుర్ఘ‌ట‌న జ‌రిగిపోయింది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యంతో పాతిక‌మందికి పైగా భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గోదావ‌రి తీరం అంతా విషాదంగా మారిపోయింది. తొక్కిస‌లాట మీద అన్ని వైపుల నుంచి దిగ్భ్రాంతి వ్య‌క్తం అవుతోంది. ఈ ఘ‌ట‌న‌పై వైఎస్సార్‌సీపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే దీనికి కార‌ణ‌మని పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అభిప్రాయ ప‌డ్డారు.
హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌చార ఆర్భాట‌మే కొంప ముంచింద‌ని ఆయ‌న అన్నారు.
మొత్తం అన్ని ప‌నుల్ని చంద్ర‌బాబే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించార‌ని అంబ‌టి రాంబాబు గుర్తు చేశారు. 
పుష్కరాల ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కొంత కాలంగా దేవాదాయ శాఖ మంత్రిని దూరం పెట్టారని అంబ‌టి రాంబాబు గుర్తు చేశారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఎందుక‌ని ఆయ‌న్ని దూరం పెట్టార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మీ అవినీతి బ‌య‌ట‌కు వ‌స్తుంది కాబ‌ట్టి ఇత‌ర మంత్రుల‌కు ప్ర‌మేయం లేకుండా కేవ‌లం కోట‌రీ మంత్రుల‌తోనే ప‌నులు జ‌రిపించారని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ముఖ్యమంత్రి వ‌స్తున్నార‌ని తెలిసి, ఆయ‌న ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం పోటీ ప‌డిందని, భ‌క్తుల్ని గాలికి వ‌దిలేశార‌ని అంబ‌టి రాంబాబు అన్నారు. రూ. 1650 కోట్ల రూపాయిలు వెచ్చించి నాణ్య‌త లేని ఏర్పాట్లు చేయ‌టం వ‌ల్లే భ‌క్తుల‌కు ఈ దుస్థితి ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు చ‌నిపోతే దాన్ని రాజ‌కీయం చేయాల‌న్న‌ది త‌మ ఉద్దేశ్యం కాద‌ని అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు.