స్వప్రయోజనాలు చూసుకున్న చంద్రబాబు

6 Apr, 2013 11:04 IST
గుడివాడ, 06 ఏప్రిల్ 2013:

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితానికి జగనన్న అతి త్వరలో ముగింపు పలకబోతున్నారని శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ సాక్షిగా ఈ విషయం చెబుతున్నానని ఆమె తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం రాత్రి ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం శనివారం రాత్రి గుడివాడ చేరింది. ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నెహ్రూచౌక్‌లో ఏర్పాటు చేసిన షర్మిల బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఎటుచూసినా జనమే కనిపించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో గుడివాడ జనసంద్రమయింది.

కష్టకాలంలో ప్రజలవైపు నిలబడకుండా చంద్రబాబు స్వప్రయోజనాలు చూసుకున్నారని షర్మిల విమర్శించారు. ఎన్టీరామారావు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యవసాయం దండగన్నారనీ, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వద్దనీ చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ చంద్రబాబు నిలబెట్టలేదని చెప్పారు. కొడాలి నాని అన్నతోపాటు ఎమ్మెల్యేలు కష్టకాలంలో వైఎస్సార్ సీపీలో చేరారని తెలిపారు. వారి మీద వేటుపడుతుందని తెలిసినా... వీరు ప్రజలపక్షాన నిలబడ్డారని చెప్పారు. పదవీ వ్యామోహం వీరికా, చంద్రబాబుకా అని షర్మిల ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే తమ మీద వేటు పడిందని తెలిసినప్పటికీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు వైయస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని పేర్కొన్నారు. విలువలు విశ్వసనీయతా ఉన్నది చంద్రబాబుకా వీరికా అని ఆమె ప్రశ్నించారు. కుట్రలు వెన్నుపోట్లనుంచి చంద్రబాబు పుట్టాడని ఎద్దేవా చేశారు. రెండెకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యారన్నారు. ఆయన స్థాపించిన హెరిటేజ్ సంస్థ ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తుందని తెలిపారు. నాడు మామ ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు.

మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఉన్న ఐదేళ్ళూ సువర్ణయుగంలా ఉందని శ్రీమతి షర్మిల చెప్పారు. తండ్రి స్థానంలో నిలబడి రాజశేఖరరెడ్డిగారు ప్రతి ఒక్కరిగురించి ఆలోచించారన్నారు. అన్నిటికీ అతీతంగా ఆలోచించి ప్రతి ఒక్కరికీ మేలుచేశారని పేర్కొన్నారు. ప్రతి విషయంలో రైతుకు అండగా ఉన్నారన్నారు. రైతు రాజుగా బతికాడన్నారు. ఉచిత విద్యుత్తు ఇచ్చారనీ, ఎరువుల ధరలు పెరగనివ్వలేదనీ తెలిపారు. రైతులకు 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ఆయనదేనని చెప్పారు. అంతకు ముందు చంద్రబాబు రూపాయి వడ్డీతో రుణాలిస్తే.. రాజశేఖర రెడ్డిగారు పావలా వడ్డీకే ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. లక్షలాది మహిళలు ఆర్థికంగా నిలబడిన రోజులవని చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంటుతో విద్యార్థులందరూ చదువుకునేలా చేశారన్నారు. పేదల ఆరోగ్యావసరాల నిమిత్తం ఆరోగ్యశ్రీ అమలుచేశారన్నారు.108, 104 సర్వీసులను గురించి వివరించారు. ఇళ్ళ పథకాన్ని గుర్తుచేశారు. గుడివాడలో పక్కా ఇళ్ళ కోసం మహానేత 70 ఎకరాలు సేకరిస్తే ఆయన తదుపరి వచ్చిన వారు దానిని గురించి పట్టించుకోలేదన్నారు.

చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లివ్వగా.. మహానేత ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల మందికి పింఛన్లు మంజూరుచేశారని వివరించారు. చంద్రబాబు హయాంలో రెట్టింపైన గ్యాస్ ధరను మహానేత తన హయాంలో పైసా కూడా పెరగకుండా చూసిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. కరెంటు చార్జీలను కూడా ఒక్క రూపాయి పెంచలేదన్నారు. కొత్త పన్నులు వేయకుండానే అభివృద్ధి చేసి చూపిన ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డిగారు రికార్డు సృష్టించారన్నారు.

ఇప్పుడున్నది దుర్మార్గమైన ప్రభుత్వమని శ్రీమతి షర్మిల విమర్శించారు.  బతుకు భారమయ్యందని ప్రజలు అల్లాడుతున్నారు. ఏ సరకు ధరయినా ఆకాశాన్నంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముందుచూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు లేకుండా పోయిందన్నారు. మహానేత బతికుంటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడానికి కారణం ముఖ్యమంత్రిది కాదా అని ప్రశ్నించారు. కరెంటు లేకపోయినా మూడింతలు బిల్లులొస్తున్నాయేమిటని మహిళలు అల్లాడిపోతున్నారన్నారు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కాదు కనకనే కిరణ్ కుమార్ రెడ్డికి వారి బాధలు తెలియడం లేదన్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహానేత రాజశేఖరరెడ్డిగారు నిరహార దీక్ష చేసిన చోటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఈ ముఖ్యమంత్రిగారికి కనిపించడం లేదనీ, వినిపించడం లేదనీ ఆమె విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న నిరాహార దీక్షలు ప్రజల కోసమని ఆయన గుర్తించాలని కోరారు. తానేం చేసినా చెల్లిపోతుందని కిరణ్ కుమార్ రెడ్డిగారు అనుకోవడానికి కారణం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుల చంద్రబాబు ఈ సర్కారుకు వెన్నుదన్నుగా నిలవడమేనని ఆమె చెప్పారు. ఏకంగా 32 వేల కోట్ల రూపాయలను కరెంటు భారంగా మోపుతున్నారన్నారు. దీనికి కారణం చంద్రబాబేనని ఆమె తెలిపారు. తన మీద విచారణ జరగకుండా ఉండటానికి చంద్రబాబు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఎన్టీరామారావు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను శ్రీమతి షర్మిల చదివి వినిపించారు.