చిన్నారి సన్నీకి పెన్షన్ మంజూరు చేయండి
నెల్లూరు: పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న నెల్లూరు నగర నవాబుపేటకు చెందిన జె. సన్నీ అనే చిన్నారికి పెన్షన్ మంజూరు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ కలెక్టర్‌ను కోరారు. పెన్షన్ మంజూరులో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. శనివారం నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కలెక్టర్ ముత్యాలరాజును ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చిన్నారి సన్నీతో కలిసి వెళ్లి వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం కొత్త పెన్షన్‌లు ఇవ్వడం పూర్తయినా నెల్లూరు నగరంలో మాత్రం పెన్షన్ మంజూరులో నెల ఆలస్యం అయ్యిందన్నారు. రెండు చేతులు లేనటువంటి పూర్తి వికరాంగులైనా జన్మభూమి కమిటీలు పట్టించుకోవడం లేదన్నారు. తనకు అనువైన వారికి పెన్షన్లు మంజూరు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పెన్షన్‌ల మంజూరులో అధికార పార్టీ నేతలు సిగ్గులేకుండా వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. చిన్నారి సన్నీ పెన్షన్‌పై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. పెన్షన్‌ల మంజూరులో కోటాలు విధించడం అన్యాయమని డిఆర్‌డిఎ వారు మంజూరు చేసిన వారికి పెన్షన్లు ఇవ్వని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్ సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.