జగన్‌ సీఎం కావాలన్నది జనం అభిమతం

20 Aug, 2017 10:37 IST
పామిడి: ప్రజా వ్యతిరేక విధానాలతో అవినీతి పాలన అందిస్తున్న టీడీపీది దుర్మార్గపు పాలన అని వైయస్సార్‌సీపీ గుంతకల్‌ నియోజకవర్గం సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి అన్నారు. స్థానిక అనిమిరెడ్డి ఫ్యాక్టరీలో పామిడి, గుత్తి మండలాల పట్టణ, గ్రామ కమిటీ, బూత్‌ కమిటీలకు నవరత్నాల పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వైవీఆర్‌ విచ్చేసి మాట్లాడారు. పార్టీలకతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహోన్నత వ్యక్తి దివంగత సీఎం వైయస్‌.రాజశేఖరరెడ్డి అన్నారు.

 నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్న జననేత జగన్‌ తండ్రిబాటలో పయనిస్తున్నారన్నారు. జగన్‌ సీఎం కావాలన్నది జనం అభిమతం అన్నారు. స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యమన్నారు. అక్రమార్జనతో సంపాదించిన కోట్ల రూపాయల అవినీతి సొమ్మును గుమ్మరించి నంద్యాలలో గెలవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు కుయుక్తులను ఓటరు దేవుళ్లు తిప్పి కొట్టి వైయస్సార్‌సీపీకి విజయం అందించి ధర్మాన్ని గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.