బాబు అవినీతి వల్లే పోలవరం ఆలస్యం

4 Oct, 2017 17:01 IST
  • ప్రాజెక్ట్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
  • ముడుపుల కోసం బాబు ఆరాటం
  • ప్రాజెక్ట్ ప్రజలకు అందకపోవడానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
  • బాబు మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది
  • పోలవరం వైయస్ఆర్ ఘనతే
  • వైయస్ఆర్ కాలువలు తవ్విస్తుంటే బాబు అడ్డుపడ్డాడు
  • చంద్రబాబుపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజం
విజయవాడః పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి  ప్రభుత్వానికి లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి మూలంగానే పోలవరం ఆలస్యమవుతుందని అన్నారు.  పోలవరానికి సంబంధించిన లెక్కలను రాష్ట్రప్రభుత్వం పంపించలేదని కేంద్రం  చెబుతోందంటే...చంద్రబాబు ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతూ మోసం చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని నాలుగు డిపార్ట్ మెంట్ లను ఏపీ సర్కార్ మేనేజ్ చేసిందని ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్  చెప్పారంటే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో తెలుస్తోందన్నారు. మీ లంచాలకోసమా, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు మేనేజ్ చేశారా బాబూ..? దేని కోసమో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత..? ఎంతవరకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది..? కాంట్రాక్టర్ల ద్వారా ఎంత కమీషన్ కొట్టేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు.

అంచనాలు పెంచడం మూలంగా ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని మీకు అర్థం కావడం లేదా బాబూ..? అని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ కాస్ట్, నిధుల ఆలస్యం గురించి రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి గడ్కరీని ఎందుకు అడగలేదని నిలదీశారు.   పట్టిసీమ, పురుషోత్తంపట్నంలను  ముడుపుల కోసమే ప్రారంభించారని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.  ముడుపులు అందాకే పోలవరం పనులకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచారని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారన్నారు. నిజంగా పోలవరం రాష్ట్రానికి జీవనాడని బాబు భావిస్తే అధికారంలోకి వచ్చిన రెండో రోజునుంచే  దాన్ని ప్రారంభించేవారని, కానీ అలా చేయలేదన్నారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నంలలో ఎంత వస్తే అంత రాబట్టుకున్నాకే పోలవరంపై దృష్టిపెట్టారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులో రాకపోవడానికి, రాష్ట్ర రైతాంగం నష్టపోవడానికి పూర్తిగా చంద్రబాబుదే బాధ్యత అని నిప్పులు చెరిగారు. 

పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి బాబు తన గత తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు ఆలోచన చేయలేదని, ఇప్పుడు కూడ ముడుపుల కోసమే పోలవరాన్ని ఆలస్యం చేస్తున్నారని పార్థసారధి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం వైయస్ఆర్ కష్టపడి అన్ని అనుమతులు తీసుకొస్తే ఒరిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో కుమ్మక్కై ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు బాబు కుట్ర పన్నాడన్నారు. రాష్ట్ర రైతాంగానికి ప్రాణపదమైన ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనే ధృడసంకల్పంతో వైయస్ఆర్ కాలువలని తవ్విస్తే.... బాబు తనకు సంబంధించిన రైతులతో కోర్టులో కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశాడన్నారు. కాలువలు బాబు కుట్ర మూలంగా ఆగిపోయింది వాస్తవం కాదా..?అని ప్రశ్నించారు.    

బాబు కరప్షన్ గురించి కేంద్రానికి అర్థమైపోయిందన్నారు. నంద్యాలలో 200కోట్లు వెదజల్లి గెలిచామని జబ్బలు చర్చకుంటున్న బాబు...అన్ని నియోజకవర్గాల్లో ప్రాజెక్ట్ ద్వారా దోచుకోవాలని చూస్తున్నారని కేంద్రం అనుమానపడుతోందని పార్థసారధి అన్నారు.  ప్రాజెక్ట్ ల కాస్ట్ విపరీతంగా పెరిగితే జాతి ప్రయోజనాలకు నష్టమని కేంద్రమంత్రి కామెంట్ చేశారంటే, మీరు ఆలోచన చేస్తున్నారా బాబూ..? సంవత్సరంలోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నప్పుడు...ప్రాజెక్ట్కుసంబంధించి నిర్ధిష్టమైన ఫిగర్ ను ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.  ప్రాజెక్ట్ కాస్ట్ , ఫండింగ్ కు సంబంధించి కేంద్రం ఫైనలైజ్ చేయలేదంటే ఏవిధంగా భావించాలని ప్రభుత్వాన్ని కడిగేశారు.