పంట పరిహారంపై సిఎం ప్రకటన చేయాలి!

8 Nov, 2012 21:34 IST
ఖమ్మం

8 నవంబర్ 2012: రైతుల పంట నష్టపరిహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. పత్తిపంటకు ఎకరాకు రూ.25 వేలు, మిర్చికి రూ.20 వేలు పరిహారం చెల్లించాలని ఆమె కోరారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో తుఫాను వర్షాల కారణంగా నష్టపోయిన పత్తిపంటను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తుపాను కారణంగా రైతులు భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం బృందం వచ్చి సర్వే చేస్తుందంటూ ప్రభుత్వం చెపుతోందని, ఈ లోగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె హెచ్చరించారు. పంటనష్టపోయిన రైతులు నిర్వేదంతో ఆత్మహత్యలు చేసుకున్నాక సర్వేలు చేసి మాత్రం ఏం ప్రయోజనమని ఆమె ప్రశ్నించారు. సర్వేలు పూర్తి చేసేంతవరకు రైతులు వేచి ఉండాలనడం సరికాదన్నారు.  రైతులకు పరిహారం వచ్చే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆమె చెప్పారు. రైతుల సమస్యలపై అసెంబ్లీని ముట్టడిస్తామనీ,  ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అన్నదాతలను ఆదుకోవాలని విజయమ్మ హితవు పలికారు. ఆమె తుఫాను బాధితులను పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. నష్టపరిహారం ఇప్పించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.