సమస్యలపై సీఎంను నిలదీస్తాం
1 Jan, 2016 10:57 IST
విజయనగరం : ప్రజాస్వామ్యానికి పునాదులైన పంచాయతీరాజ్ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం మరింత బలహీన పరుస్తోందని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి.అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. ఈనెల 2న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును పంచాయతీ సమస్యలపై నిలదీస్తామన్నారు. పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇస్తామని వారు చెప్పారు.
రాష్ట్రంలో 1324 స్థానిక సంస్థలకు తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని, అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు బాధ్యతలను పంచాయతీల నుంచి తప్పించి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరనున్నట్టు చెప్పారు. పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనను ఉపసహరించుకోవాలన్నారు.