రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలకు రక్షణ కరువు

22 Mar, 2017 17:23 IST

అంబాజీపేట :టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రతిపక్ష మహిళా శాసన సభ్యులకే రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైయస్సార్‌ సీపీకి చెందిన దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం పై ఆయన స్పందించారు. ఒక పక్క మహిళా సాధికారిత అంటూ మరో పక్క మహిళలపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించడంపై మండిపడ్డారు.  ప్రభుత్వ తీరును ప్రజలకు తెలియపర్చే అధికారం కూడా రాష్ట్రంలో లేదా అని ఆయన ప్రశ్నించారు. మహిళలు సిగ్గుపడేలా ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా మార్షల్‌ చేత నెట్టించారని, మాట్లాడుతుంటే మైకులు లాక్కుని రౌడీయిజం చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరును ఎండగట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల మందిని కొనుగోలు చేసినా, లక్షల మంది ఓటర్లు అధికార పార్టీని తీవ్రంగా ఎండగట్టారన్నారు.