ప్రజలను మభ్యపెడుతున్న నాయుళ్లు
నెల్లూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులు మభ్యపెడుతున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. బుధవారం కావలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన బీజేపీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నరేంద్రమోడి ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. పెద్ద నోట్లు రద్దు వల్ల పేద ప్రజలు పడుతున్న కష్టాలు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, మళ్లీ క్యాష్‌లెస్ అంటూ మరో నరకం చూపించబోతోందని ధ్వజమెత్తారు. కార్డులు గీకి డబ్బులు చెల్లింపులు అంటేనే పుట్టెడు మోసాలని, గోంగూరు, టమోటాకు కార్డులు ఎలా గీకుతారని వంటేరు ప్రశ్నించారు. కావలి తలరాతలు మార్చే రామయాపట్నం పోర్టు కమ్ షిప్ యార్డు నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం, టిడిపి నాయకులు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని అన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరం కలిసి దీనిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. కావలి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వకుండా అధికారులు శీతకన్నుతో చూస్తున్నారని, ఇలా అయితే తాము ప్రత్యేక జిల్లా కోసం పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కావలి మున్సిపాలిటీలో వైయ్యాస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల వార్డులలో అభివృద్ధి పనులు చేయకుండా వివక్ష చూపడం అలేఖ్యకు, కమీషనర్ కు తగదన్నారు. తాను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీల్లో చేయడం లేదని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా కావలి నుంచి తాను పోటీ చేస్తానని దుష్ప్రచారం చేస్తున్నారని వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశుఖర్‌రెడ్డిలను కావలి, ఉదయగిరి ల నుంచి గెలిపించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు మదన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌లు పాల్గొన్నారు.