నేను జగనన్న వదిలిన బాణాన్ని : షర్మిల

18 Oct, 2012 03:10 IST
ఇడుపులపాయ, 18 అక్టోబర్ 2012 : ''నేను జగనన్న వదిలిన బాణాన్ని. రాజశేఖర్‌రెడ్డి కూతురిగా, జగనన్న చెల్లెలుగా, వైయస్సార్‌పార్టీకి చెందిన ఒక సామాన్య కార్యకర్తగా, వైయస్సార్‌పార్టీకి చెందిన ఒక సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నాను...'' ఈ మాటలతో వైయస్‌ కుమార్తె, జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల తన చరిత్రాత్మక మరో ప్రజాప్రస్తానాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11.45 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్‌ ఘాట్‌ నుండి ఆమె అశేష జనవాహిని వెంట నడువగా తన పాదయాత్రను ప్రారంభించారు. మీ రాజన్న కూతుర్ని, మన జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిల అంటూ ఆమె తనను తాను పరిచయం చేసుకోగానే లక్షలాదిగా హాజరైన జనం ఒక్క పెట్టున చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలపై ఆమె పదునైన విమర్శలతో ధ్వజమెత్తారు. జగనన్న ఆశీస్సులతో మీ ప్రేమను పొందేందుకు ఈ ప్రజాప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాననీ, ప్రతి అడుగులోనూ నాన్నను, జగనన్నను, ప్రజల కష్టనిష్ఠూరాలను గుర్తు చేసుకుంటానని షర్మిల అన్నారు. అన్నిటా విఫలమైన ఈ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ 'అవిశ్వాసం' ఎందుకు పెట్టడం లేదంటూ ఆమె నిలదీశారు. ఒకపక్క ఈ ప్రభుత్వం విఫలమైందని చెబుతూనే అవిశ్వాసం పెట్టకపోవడంలోని మతలబు ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఆ తర్వాత సమాపంలోని ట్రిపుల్ ఐటి విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. జగనన్నతోనే రాజన్నరాజ్యం సాధ్యమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించాలని షర్మిల పిలుపునిచ్చారు.

షర్మిల ప్రసంగం పూర్తి పాఠం...

"ఈ రోజు ఒక దృఢ సంకల్పంతో మీ ముందు నిలుచున్నా. రాజశేఖర్‌ రెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రాష్ట్రప్రజలను అన్ని విధాలుగా క్షోభ పెడుతోంది.  రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విద్యార్థులకు పూర్తిగా మొండి చెయ్యి చూపించింది. ఆరోగ్యశ్రీని కట్టిపెట్టింది. ఘోరమైన విద్యుత్‌ సంక్షోభాన్ని ఈ రోజు మన రాష్ట్రం ఎదుర్కొంటోంది. అమ్మ విజయమ్మ సుదీర్ఘంగా ఈ రాష్ట్రప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో మనందరికీ వివరించారు. అయినా నిలదీయాల్సిన తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మూడేళ్లుగా చోద్యం చూస్తోంది. మూడేళ్లుగా టిడిపి తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడుగారు. అసలు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి (కారణమైన) రెండు ముఖ్యమైన వాగ్దానాలను చంద్రబాబునాయుడుగారు నిలబెట్టుకోలేకపోయారు.
ఒకటి రెండ్రూపాయలకు బియ్యం. ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. బాబుసార్‌కి ఆ రోజు మాట నిలబెట్టుకునే ఉద్దేశ్యం లేదు. ఈ రోజూ మాట నిలబెట్టుకునే ఉద్దేశ్యం లేదు. రైతన్నను పూర్తిగా విస్మరించారు.వ్యవసాయం దండగన్నాడు. ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది సార్లు విద్యుత్‌చార్జీలను పెంచారు. పెంచి రైతులను ఆ చార్జీలను కట్టమని ఒత్తడి చేశారు. కట్టలేం మహాప్రభో అని వేడుకుంటే వారి మీద కేసులు పెట్టారు. జైళ్లల్లో పెట్టారు. ఇళ్లల్లో ఉన్న వారి సామాన్లను కూడా ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పాపం బాబుగారిది కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు మటుకు ఎల్లో డ్రామాకు తెరలేపుతూ పాదయాత్ర అంటూ ఏదో ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లు మొసలికన్నీరు కారుస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకిగాని, చంద్రబాబునాయుడుగారికిగాని,ఆయన చేస్తున్న పాదయాత్రకు గాని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా-ఈ చేతగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానం ఎందుకు పెట్టరు అని అడుగుతున్నాం. జగనన్న నాయకత్వంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేయతలపెట్టిన ఈ మరో ప్రజాప్రస్థానానికి ముఖ్య ఉద్దేశ్యాలు రెండే. ఈ అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం ఒకటైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా ఎందుకు కాపాడుతున్నారని చంద్రబాబుగారిని నిలదీయడం ఇంకొకటి.
కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యారనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి.జగనన్న మీదైతే కేసులు పెడతారు. విచారణ పేరుతో జైల్లో పెడతారు. కానీ చంద్రబాబునాయుడుగారు మాత్రం చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఆయనపై కేసులు లేకుండా ఆయనపై విచారణ జరుగకుండా గొప్పగా మ్యానేజ్‌ చేసుకుంటారు. ఎంఎల్‌సి ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటారు.మొన్న జరిగిన ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో ఎక్కడెక్కడైతే వైయస్సార్‌ పార్టీ గెలుస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారో అక్కడక్కడ కొన్ని స్థానల్లో తెలుగుదేశంవారు కాంగ్రెస్‌కు ఇంకొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌వారు తెలుగుదేశంకు నిస్సిగ్గుగా సపోర్ట్‌ చేసుకుని, నిస్సిగ్గుగా సపోర్ట్‌ చేసుకున్నారనడానికి ఆ ఎన్నికలే, ఆ ఫలితాలే రుజువు.
వారి ఉద్దేశ్యమల్లా ఒకటే.  ఈ రాష్ట్రంలో రెండే పార్టీలుండాలట. ఉంటే కాంగ్రెస్‌ ఉండాలట అధికారంలో...లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండాలట. మూడో పార్టీ అనేది ఉండకూడదట. అందుకుగాను ఎన్ని కుట్రలైనా చేస్తారు. ఎన్ని కుతంత్రాలైనా పన్నుతారు.
నిరంతరము ప్రజల మధ్య ఉన్న జగనన్న ప్రజలకొచ్చిన ప్రతి సమస్యా తన సమస్యగా భావించి స్పందించారు. ఎన్నో సార్లు దీక్షలు చేశారు. ప్రతిపక్షం, ప్రధానప్రతిపక్షం చేయాల్సిన పని ఆయన చేయడానికి ప్రయత్నించారు. నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకుంటున్నారని గమనించి, అదే గనక జరిగితే కాంగ్రెస్‌కు తెలుగుదేశంకు ఇక మనుగడ ఉండదని ఎలాగైనా జగనన్నను వాళ్ల మధ్య నుంచి తీసివేయాలని కుట్రలు పన్ని, ఇద్దరూ కలిసి, చేతిలే చెయ్యేసుకుని కాంగ్రెస్, తెలుగుదేశం జగనన్న మీద కేసులు పెట్టారు. సిబిఐని వాడుకుని, కాంగ్రెస్, తెలుగుదేశంలు కలిసి ఈ రోజు విచారణ అన్న పేరుతో జగనన్నను అరెస్టు చేయడం జరిగింది.మొన్నటికి మొన్న మరుసటిరోజు బెయిలు వస్తుందనగా చంద్రబాబునాయుడుగారు తన ఎంపీలను చిదంబంరంగారి దగ్గరికి పంపించారు. ఈయన ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు కదా, చిదంబరంగారి దగ్గరకు ప్రజల సమస్యల మీద పంపించారు మీరనుకుంటే, అది మీ పొరపాటు. అలా అనుకున్నవారికి చంద్రబాబుగారి గురించి తెలియదని అర్థం. ఆయన ఎందుకు పంపారో తెలుసా? జడ్జిగారి జడ్జిమెంటుని ప్రభావితం చేయడానికి ఈడీని వాడుకుని జగనన్న సాక్షిని, సాక్షి ఆస్తులను జప్తు చేయించడానికి కోరుతూ తన ఎంపీలను పంపారు. అక్కడ చిదంబరంగారు పని చేస్తున్నది తెలుగుదేశం పార్టీ కోసమే అన్నట్లు, ఏనాడు ప్రజలపక్షాన ప్రజల సమస్యలపై అంత తొందరగా స్పందించనివారు వెనువెంటనే, ఆ రోజే  ఈడీని ఉసిగొలిపి కొన్ని గంటల వ్యవధిలోనే సాక్షి ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ ప్రతిపక్షం కలిసి చేస్తున్న కుమ్మక్కు రాజకీయానికి నిరసనగా, జగనన్నను జైల్లో పెట్టడానికి
కుట్రలు పన్నుతున్న ఈ కుట్ర రాజకీయానికి నిరసనగా, ఈ మహా ప్రజాప్రస్థానంలో పాల్దొంటున్నప్రతి కార్యకర్తా, నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలియజేయాలని మేం తలంచుతున్నాం.జగనన్న బయటికి వచ్చేంతవరకు, ఈ నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని ఈ కుట్ర రాజకీయాలకు నిరసన తెలియజేయదలుచుకున్నాం. నిజానికి ఈ ప్రస్థానం జగనన్నే చేయవలసింది.ఆయన మన మధ్య ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది. కానీ ఆయన ఈ రోజు మన మధ్య రాలేని కారణంగా నన్ను పంపారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని...నేను జగనన్న వదిలిన బాణాన్నిరాజశేఖర్‌రెడ్డి కూతురిగా జగనన్న చెల్లెలుగా వైయస్సార్‌పార్టీకి చెందిన ఒక సామాన్య కార్యకర్తగా, వైయస్సార్‌పార్టీకి చెందిన ఒక సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నాను. రాజశేఖర్‌రెడ్డిగారిని అభిమానించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో, రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యం అని నమ్మే ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించాలనీ, నాతో పాటే కదం తొక్కాలనీ వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని బలపరచాలనీ నా ప్రార్థన. దేవుని దీవెనలు తీసుకుని, నాన్నకు నమస్కరించి జగనన్న ఆశీస్సులతో మీ ప్రేమను పొంది ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నాను.  ప్రతిక్షణం, ప్రతి అడుగులో నాన్నను తలుచుకుంటాననీ, జగనన్నను తలుచుకుంటాననీ ఈ రాష్ట్రప్రజలు పడుతున్న కష్టాలను తలుచుకుంటాననీ మీకు మాటిస్తున్నాను. గుండె నిండా నాన్న పట్ల జగనన్న పట్ల అభిమానంతో ఇక్కడికి చేరి వచ్చినందుకు, మాకు బలంగా నిలిచినందుకు మా హృదయపూర్వక వందనాలు...."(ప్రజలకు అభివాదంతో ప్రసంగం ముగించారు.)