నాంపల్లి సిబిఐ కోర్టుకు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి

25 Sep, 2012 02:04 IST
హైదరాబాద్, 25 సెప్టెంబర్‌ 2012: వాన్‌పిక్ అభియోగాల కేసుకు సంబంధించి వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుపై మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుంది. ఉదయం 10.30 గంటలకు జగన్మోహన్‌రెడ్డి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు.

కాగా, చంచల్‌గూడ జైలు నుంచి జగన్ బయటకు రాగానే ఆయన అభిమానులు జై జగ‌న్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జైలు ద్వారం నుంచి వెలుపలికి వచ్చిన వెంటనే అభిమానులకు జగన్మోహన్‌రెడ్డి అభివాదం చేశారు. దీనితో ఆయన అభిమానుల్లో ఆనందం పెల్లుబికింది. ‌విచారణ కోసం జగన్‌ కోర్టుకు హాజరవుతున్నందున చంచల్‌గూడ జైలు నుంచి సిబిఐ ప్రత్యేక కోర్టు వరకూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదే కేసుకు సంబంధించి తన పదవికి రాజీనామా చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి మోపిదేవ వెంకట రమణ, మరో ఇద్దరు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు శామ్యూల్, మన్మోహ‌న్‌సింగ్ కూడా విచారణను ఎదుర్కొంటున్నారు.‌ వాన్‌పిక్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి కూడా జగన్మోహన్‌రెడ్డి కన్నా ముండుగానే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు హాలులో ధర్మాన ప్రసాదరావుతో జగన్మోహన్‌రెడ్డి కరచాలనం చేశారు.