ఫిరాయింపుఎమ్మెల్యే మీద కన్నతల్లి మండిపాటు

9 Jul, 2016 13:01 IST

కర్నూలు )) ప్రలోభాల కోసం వైయస్సార్సీపీ ని విడిచిపెట్టి టీడీపీలో చేరిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన పని సరైనది కాదని ఆయన కన్నతల్లి బుడ్డా ఓబులమ్మ అభిప్రాయ పడింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో బుడ్డా కుటుంబసభ్యులంతా సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఓబులమ్మ మీడియాతో మాట్లాడారు.

రెండు సార్లు ఎన్నికల్లో ఓటమి పాలైన బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకొని వచ్చారని గుర్తు చేశారు. కేవలం బుడ్డా కుటుంబం మీద ఉండే అభిమానంతో టికెట్ ఇచ్చి గెలిపిస్తే, మాట మాత్రం చెప్పకుండా పార్టీ మారి, తన కుమారుడు తప్పు చేశాడని ఆమె స్పష్టం చేశారు. పైగా జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించి గౌరవించారని, అటువంటప్పుడు పార్టీ మారటం ఎంత వరకు సబబని ఆమె ప్రశ్నించారు. కేవలం డబ్బు తీసుకొని పార్టీ మారాడన్న మాటను తాము జీర్ణించుకోలేక పోతున్నామని ఓబులమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తిరిగి బుడ్డా కుటుంబం నుంచే శేషారెడ్డికి పార్టీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించటం సంతోషదాయకం అని ఆమె అన్నారు. బుడ్డా కుటుంబసభ్యులంతా వైయస్సార్సీపీ వెంటే ఉంటామని, అభిమానులంతా ఇదే బాటలో నడవాలని ఆమె పిలుపు ఇచ్చారు.