ప్రజలను అన్నిరకాలుగా మోసం చేశారు

24 Nov, 2015 15:03 IST
పాలన పూర్తిగా నిర్వీర్యం
కేంద్రంముందు సాగిలబడిన చంద్రబాబు
ప్రజలకు తీరని అన్యాయం

విజయనగరంః రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు దారుణంగా తయారైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. చంద్రబాబు  అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులను తీసుకురాలేకపోయారని విమర్శించారు. తుఫాన్ తో వరద బాధితులు అల్లాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తమిళనాడు ప్రభుత్వం తక్షణ సహాయం కింద కేంద్రం నుంచి రూ. 939 కోట్లు మంజూరు చేయించుకుందని వీరభద్రస్వామి తెలిపారు. చంద్రబాబు కేంద్రంలో భాగస్వామ్య పార్టీ అయి ఉండి కూడా నిధుల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 

హుద్ హుద్ తుఫాన్ కు కేంద్రం రూ. 1000 కోట్లు సహాయం ప్రకటించి సంవత్సరకాలం పూర్తయినా..చంద్రబాబు దాంట్లో సగం కూడా తీసుకురాలేదని  వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కేంద్రం వద్ద లొంగిపోయి..ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు కేంద్రాన్నినిలదీసే సత్తా లేదని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో ప్రజాపాలన సాగడం లేదని వీరభద్రస్వామి మండిపడ్డారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఇళ్లులేని అభాగ్యులకు తిండిపెట్టకుండా...నెల్లూరును అభివృద్ధి చేస్తా, స్మార్ట్ సిటీ చేస్తానంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతూ సందర్భంలేని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల తాలూకు బాధలు చెబుతుంటే...ప్రభుత్వం సహాయక చర్యల్లో ప్రకటనలకే పరిమితమైందన్నారు. ఎంతసేపు చంద్రబాబు ఏవిధంగా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలన్నధ్యాసే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు.

పాలన పూర్తిగా అవినీతి మయమైందని టీడీపీ నేతలే అంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు తన పాలనలో ప్రజలను అన్నిరకాలుగా కష్టాలకు గురిచేస్తున్నారని వీరభద్రస్వామి నిప్పులు చెరిగారు. పెరిగిన నిత్యవసర ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యం చేశారు. రైతులను మోసం చేశారని వీరభద్రస్వామి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఏమాత్రం  చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కేంద్రాన్ని తుఫాన్ సహాయం అడగాలని డిమాండ్ చేశారు.