ఇది మోసాల పరిపాలన

12 Mar, 2016 15:54 IST

 గుంటూరు) మోసపూరిత విధానాలతోనే చంద్రబాబు పరిపాలన సాగుతోందని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నిల్లి రామక్ఱిష్ణారెడ్డి అన్నారు.  అధికారంలోకి రాలేమనే భయంతో ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఇప్పడు వాటిని అమలు చేయలేక అసహనం  ప్రదర్శిస్తున్నారని, ఆయన పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డు పడుతోందని అడ్డగోలుగా విమర్శలు చేయటం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందన్నారు. పేద, బడుగు బలహీనవర్గాలపై ప్రేమ ఉంటే ఆయా వర్గాలకు బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు ఒకేసారి రూ.10 వేలు రుణమాఫీ చేస్తానని చెప్పిన బాబు ప్రస్తుత బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే చేయలేదన్నారు.


రైతులు, చేనేత కార్మికులతోపాటు నిరుద్యోగులను పూర్తిగా మోసగించిన చంద్రబాబు ఇంకా అభివృద్ధి పేరుతో రోజూ ప్రజలను మోసగించే విధంగా మాట్లాడటం విడ్డూరమన్నారు. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.2వేల భృతి అందిస్తానన్న చంద్రబాబు అసలు ఆ పథకం ప్రస్తావన చేయలేదని మంత్రులతో చెప్పించటం దారుణమన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కేంద్రం చేయూతనివ్వటం లేదని చెబుతున్న చంద్రబాబు రోజూ విమానాల్లో చక్కర్లు కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తున్న వైనంపై ప్రజలను చైతన్యపరిచి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు.