జగన్‌ను విమర్శించే అర్హత డీకే అరుణకు లేదు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత మంత్రి డీకే అరుణకు లేదని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. తనను రాజకీయంగా పెంచి పెద్ద చేసిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపైనే ఆమె అర్థరహితంగా ఆరోపణలు చేయడం తగదని గట్టు నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతున్న శ్రీ జగన్‌పై అరుణ వ్యాఖ్యలు ఎంతమాత్రం తగదన్నారు.
శ్రీ వైయస్ జగన్ సమైక్య శంఖారావం సభలో చెప్పినట్లుగానే కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని గట్టు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యం అయితే డీకే అరుణ సొంత జిల్లా మహబూబ్‌నగర్ పూర్తిగా ఎడారిగా మారుతుందన్న వాస్తవాన్ని ఆమె గ్రహించాలని గట్టు రామచంద్రరావు హితవు పలికారు.