వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన ఐటీ నిపుణులు
ఐ.టి. రంగానికి చెందిన సుమారు 70 మంది ఇంజనీర్లు శనివారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో వారంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పలు బహుళజాతి సంస్థలలో వారంతా ఐటి ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి చేరిక కార్యక్రమంలో ఐటీ విభాగం కమిటీ సభ్యులు హర్ష, శివశంకర్‌తో సహా పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఐటీ విభాగంలో లక్ష మంది ఐటీ నిపుణులను చేర్చుకోవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇప్పటికే 18 వేల మంది పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ తరఫున ఐటీ నిపుణులంతా ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని మధుసూదన్‌రెడ్డి తెలిపారు.