మంత్రి పితాని నివాసం ముట్టడించిన వైయస్‌ఆర్‌సిపి
15 Oct, 2012 02:29 IST
మెస్ చార్జీలు పెంచాల్సిందే: పుత్తా ప్రతాపరెడ్డి
పుత్తా సహా పలువురు విద్యార్థుల అరెస్ట్
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని, సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను విస్మరించిన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థులు అష్టకష్టాల పాలవుతున్నారని, చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని అన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు ఏమూలకూ సరిపోవన్నారు. ‘ప్రభుత్వం మూడు నుంచి 5వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.475, 10వ తరగతి వరకు రూ.535, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర విద్యార్థులకు 520 రూపాయలే ఇస్తోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ప్రభుత్వం అందజేస్తున్న నిధులు ఏ మేరకు సరిపోతాయో పాలకులే సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
మంత్రి పితానికి పుత్తా ప్రశ్నలు:
ఈ ఆందోళన సందర్భంగా మంత్రి పితానికి పుత్తా ప్రతాపరెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘రాష్ట్రంలో 10 లక్షల మంది హాస్టళ్లలో అర్ధాకలితో మగ్గుతున్న మాట వాస్తవం కాదా? మూడు పూటలకు ఒక్కో విద్యార్థికి ఇస్తున్న 17 రూపాయలు ఒక్కపూట ఆకలినైనా తీరుస్తుందా? గత నాలుగేళ్లలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో ఒక్క రూపాయి మెస్‌చార్జీ పెంచారా, అయితే ఈ సమయంలో నిత్యావసరాల ధరలు మాత్రం 200 శాతం పెరిగిన మాట నిజం కాదా?’ అని ఆయన మంత్రిని నిలదీశారు.