మళ్ళీ రుజువైన వ్యవస్థల దుర్వినియోగం

23 Mar, 2013 14:56 IST
హైదరాబాద్, 23 మార్చి 2013: రాజకీయ ప్రయోజనాల కోసం సిబిఐ, పోలీసు లాంటి వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం‌ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నదని మరోసారి రుజువైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం బ్రిటిష్‌ పాలనను తలపించేలా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. శోభా నాగిరెడ్డి శనివారం శాసనసభలో మాట్లాడారు. వ్యవస్థలను దుర్వినియోగం చేయడంలో, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో ఈ ప్రభుత్వం ముందు ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు ఎదురు తిరిగినా అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తోందని ఆమె ఆరోపించారు.

శుక్రవారంనాటి సడక్‌ బంద్‌ సందర్భంగా పోలీసు వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతగా దుర్వినియోగం చేసిందో స్పష్టమైందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు సాధారణం అన్నారు. ‌సడక్ బంద్‌ సందర్భంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలని శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదని శోభా నాగిరెడ్డి విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తే ఆ నాయకులపైన కూడా నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మంత్రి పదవులు ఇస్తామంటారని, సచ్ఛీలురు అంటారని, కాదని బయటికి వస్తే సిబిఐని వాడుకుని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐని, పోలీసు వ్యవస్థను కాంగ్రెస్‌ పార్టీ వాడుకుంటోందని కేంద్రంలో వారికి మద్దతు ఇచ్చిన పక్షాలే పేర్కొన్న వైనాన్ని శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు.