వైఎస్ జగన్ పోరాటాలకు మా మద్దతు
29 Jan, 2016 11:05 IST

హైదరాబాద్: ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు ప్రకటించింది. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆధ్వర్యంలో పలువురు నేతలు వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ దళిత, బలహీనవర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని వారు వైఎస్ జగన్‌కు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎస్సీలు ఎంతో లబ్ధి పొందారని చెప్పారు.
కలసిమెలసి ఉన్న ఎస్సీల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని మాలమహానాడు నేతలు మండిపడ్డారు. చంద్రబాబు వల్లే ఏపీలో దళితులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే వైఎస్ జగన్ నాయకత్వం అవసరమని, అందుకే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెన్నయ్య తెలిపారు. జననేతను కలిసిన నేతల్లో మాలమహానాడు ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాస్, తెలంగాణ మాలమహానాడు వర్కింగ్ అధ్యక్షుడు విజయ్‌బాబు, విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు కుమార్‌రాజు, విద్యార్థి నేత సుధాకర్‌బాబు ఉన్నారు