కేసీఆర్ ముక్కు నేలకు రాయాల్సిందే

17 Sep, 2012 03:24 IST

తెస్తానన్న తెలంగాణ ఏమైంది? 

ఢిల్లీలో జిత్తులమారి వేషాలెందుకు?

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి

హన్మకొండ (వరంగల్‌ జిల్లా), 17 సెప్టెంబర్‌ 2012: మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎ‌స్ అధినేత కె.చంద్రశేఖ‌రరావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధ‌ర్‌రావు డిమాండ్ చేశారు. పరకాల, స్టేష‌న్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికల్లో టీఆ‌ర్ఎ‌స్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర‌ం దిగివచ్చి తెలంగాణ ఇస్తుందని జిత్తులమారి మాటలెందుకు చెప్పావంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హన్మకొండలోని తమ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండా దంపతులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌కు చలిమంటగా మారిందని, అమాయక తెలంగాణ యువకులను రెచ్చగొట్టి ఇప్పటికే 800 మంది ప్రాణాలు బలితీసుకున్నారని ధ్వజమెత్తారు.

ఉద్యమం పేరిట ఆరునెలలు డబ్బులు దండుకోవడం.. మరో ఆరునెలలు ఫాంహౌస్‌లో ఉండడం.. కేసీఆర్ కుంభకర్ణుడి పాలసీ అంటూ ఎద్దేవాచేశారు. ప్రజలంతా ఉద్య మం చేస్తుంటే ఆయన అల్లుడు, కొడుకు, కూతురు మాత్రం ఆంధ్రా నేతలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులతో కుమ్మక్కై కో‌ట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. మీరు నడిపే న్యూస్ చాన‌ల్‌లో సీమాంధ్రుల వాటా ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి తెలంగాణ పేరు చెప్పి పూట గడుపుకోవడం, సీట్లు పెంచుకోవడం తప్ప టీఆర్ఎ‌స్‌కు వేరే పనిలేదని విమర్శించారు.

టీఆర్ఎ‌స్ అధినేత ఇచ్చిన మాటను ఏనాడూ నిలబెట్టుకోలేదని, సకల జనుల సమ్మెను ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ విలీనం చేసే భారీ ఒప్పందంతో మళ్లీ ఢిల్లీలో మకాం పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు త్యాగాలు చేయాలి.. ఉద్యమాలు చేయాలి.. కానీ, కేసీఆర్‌, ఆయన కుటుంబం ఆ అమరుల త్యాగాలను తాకట్టు పెట్టి కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని, ఉద్యమాన్ని తాకట్టు పెట్టడం తప్పితే తెలంగాణ సాధించడం చేత కాని కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన స్వప్రయోజనాల కోసం ఉద్యమ స్ఫూర్తిని తాకట్టు పెడుతున్న ఆయనను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.

వైయస్‌ పేరిట డైరీ ఆవిష్కరణ పెద్దజోక్ 

కేవీపీ రామచంద్రరావు దివంగత నేత వైయస్‌‌రాజశేఖర్‌రెడ్డి పేరిట డైరీని ఆవిష్కరించడం ఒక పెద్ద జోక్‌ అని కొండా దంపతులు వ్యాఖ్యానించారు. వైయస్‌ ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబం ఎన్నో కష్టాలు పడుతున్నా ఏనాడూ ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి ఈ రోజు డైరీ విడుదల చేయడమేంటో తమకైతే అర్థం కావడంలేదన్నారు. ఈ డైరీ ఆవిష్కరణతో వైయస్‌ పొగడటం మాట అటుంచి, ఆయనను తిట్టించినట్లయిందని సురేఖ ఆవేదన చెందారు. తాము రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్‌ కుటుంబంతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని కొండా దంపతులు స్పష్టం చేశారు.