అఖిలేష్ మాదిరే లోకేష్..బాబుకు బీపీ
4 Jan, 2017 17:20 IST
- చంద్రబాబుకు లోకేష్ భయం
- అఖిలేష్ మాదిరి లోకేష్ అధికారం నుంచి దింపేస్తాడని ఆందోళన
- కుప్పానికి నీళ్లు ఇవ్వలేని వ్యక్తి పులివెందులకు ఇస్తారంటే నమ్మాలా?
- చంద్రబాబుపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజం
తిరుపతి: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూసి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీపీ వచ్చిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. యూపీలో ములాయం సింగ్ ను అఖిలేష్ ఎలా దించేశారో చూసి, చంద్రబాబులో భయం పట్టుకుందని... అఖిలేష్ లాగానే తన కుమారుడు లోకేష్ కూడా తనను ఎక్కడ అధికారం నుంచి దించేస్తాడో అనే భయం చంద్రబాబులో ఉందని... ఈ భయంతోనే లోకేష్ ను మంత్రిని కూడా చేయడం లేదని ఆమె ఎద్దేవా చేశారు.
తిరుపతిలో బుధవారం రోజా మీడియాతో మాట్లాడారు..చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్ధాలుగా సాగుతోందని ఆమె విమర్శించారు. క్యాలెండర్లు మారుతున్నా, చంద్రబాబు మాత్రం మారడం లేదని రోజా మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు లేవన్న చంద్రబాబు... పులివెందులకు ఇస్తామంటే జనం నమ్ముతారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అన్యాయం చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని రోజా ధ్వజమెత్తారు. ఏ ఒక్క హామీ నెరవేర్చని టీడీపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని జన్మభూమి అంటూ ప్రజల వద్దకు వెళ్తారని ప్రశ్నించారు. జన్మభూమి గ్రామ సభల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ నేతలు పారిపోతున్నారని అన్నారు. ఇకనైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని, లేకపోతే ప్రజలు తరిమికొడతారని రోజా హెచ్చరించారు.