తిరుపతి నుంచి మద్యాన్ని పారదోలాలి
పుణ్యక్షేత్రం తిరుపతిని మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో గురువారం ఉదయం మహా ధర్నాను చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు. వందలాది సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మద్యపానాన్ని విచ్చలవిడిగా చేసేలా అవకాశం కల్పించి, తిరుపతి పవిత్రతను మంటగలుపుతున్నారని భూమన మండిపడ్డారు. దీన్ని అడ్డుకోవడానికి మనమంతా సామాజిక కార్యకర్తలుగా మారాలని సూచించారు. బాధ్యత గల పౌరులుగా మెలగాలన్నారు. తిరుపతి పవిత్రతను, ఆధ్యాత్మిక నగర సౌందర్యాన్నీ, విశిష్టతనూ కాపాడేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతినుంచి మద్యం మహమ్మారిని పారదోలడానికి కంకణధారులమవుదామని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రహ్మ కడిగిన పాదాన్ని మద్యంతో తడపవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమం ఈరోజుతో ఆగదనీ, గాంధీ బొమ్మ వద్ద వచ్చే రెండురోజులలో నిరశన దీక్ష చేస్తామనీ భూమన ప్రకటించారు.