కుట్రతోనే జగన్మోహన్ రెడ్డిపై కేసు: మైసూరారెడ్డి

31 Dec, 2012 15:18 IST
కడప:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై బనాయించిన కేసు పూర్తిగా రాజకీయ కుట్రతో చేసిందేనని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ ఎమ్.వి. మైసూరా రెడ్డి తెలిపారు.  నగరంలోని మా సీమ సర్కిల్‌లో ఆ పార్టీ నేత మాసీమ బాబు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంతకాల సేకరణలో మైసూరా పాల్గొన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్తపార్టీ స్థాపించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడని ఓర్వలేక ఈ కేసు బనాయించారన్నారు. విచారించమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా సీబీఐ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాతంతో దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. బెయిలు ప్రొసీజర్ నిందితుడి స్వేచ్ఛకు సంబంధించిన విషయమనీ, దీనిపై కూడా సీబీఐ దమననీతితో, కుట్ర పూరితంగా వ్యవహారిస్తోందనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు నిరసనగానే తాము సంతకాలు సేకరిస్తున్నామని చెప్పారు. జగన్‌పై అక్రమ కేసు బనాయించారని, సీబీఐ పక్షపాత ధోరణితో దర్యాప్తు చేస్తోందని ప్రజలకు తెలుపడమే సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశమని వివరించారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పార్టీ నాయకులు కొత్త సంవత్సర వేడుకలలో పాల్గొనకుండా సంతకాల సేకరణలోనే నిమగ్నమవ్వాలని మైసూరారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలువడమే దురుద్దేశ పూర్వకంగా పిలిచిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీలు ముందు కాంగ్రెస్ వైఖరి చెప్పాలని పట్టుబట్టాయని, ఆ పార్టీ నుంచి హాజరైన ఇద్దరు ప్రతినిధులు ఒకరు తెలంగాణకు, మరొకరు విశాలాంధ్రకు అనుకూలంగా అభిప్రాయం చెప్పారన్నారు. మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి, నగర కన్వీనర్ ఎస్‌బి అంజాద్‌బాషా, నాయకులు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, టీకే అఫ్జల్‌ఖాన్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అందూరి రాంప్రసాద్‌రెడ్డి, గిండి మధువర్థన్‌ రెడ్డి, బి. కిశోర్‌కుమార్, నిత్యానందరెడ్డి, ఎస్. ప్రసాద్‌రెడ్డి, పవన్‌కుమార్, సమరనాథరెడ్డి, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకట సుబ్బమ్మ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.