కొండా లక్ష్మణ్ బాపూజీకి విజయమ్మ నివాళి
21 Sep, 2012 08:06 IST
హైదరాబాద్, 21 సెప్టెంబర్ 2012: అస్వస్థతలో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్‌లో ఉంచిన బాపూజీ పార్థివదేహాన్ని సందర్శించిన విజయమ్మ పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమె బాపూజీ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. బాపూజీ నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని విజయమ్మ నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని ధారపోశారని అన్నారు.
విజయమ్మ వెంట వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత కూడా వెళ్ళి బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి తదితరులు కూడా విజయమ్మ వెంట వెళ్ళి కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు.