వాళ్ల యాత్రలు డ్రామాలు!
23 Oct, 2012 18:42 IST

జగనన్నను దేవుడే బయటకు తీసుకువస్తాడనీ ఆ రోజు రాజన్నరాజ్యం దిశగా మనందరం అడుగువు వేస్తామనీ షర్మిల దృఢంగా అన్నారు. జగనన్న నాయకత్వంలో వచ్చే రాజన్న రాజ్యంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందుతుంది. వృద్ధులకు రూ. 700 పింఛను వస్తుంది. వికలాంగులకు రూ. 1000 పింఛను వస్తుంది. అమ్మఒడి పథకం కింద బడికి వెళ్లే ప్రతి పిల్లవాడికీ రూ. 500 చొప్పున నేరుగా తల్లి ఖాతాలోనే డబ్బు జమ అవుతుంది. ఇంటర్ విద్యార్థులకు రూ. 700, డిగ్రీ చదివేవారికి రూ. 1000 చొప్పున ప్రోత్లాహకం లభిస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతు ఏనాడూ దేహీ అనకూడదన్న పెద్ద మనసు రాజశేఖర రెడ్డిదనీ, అదే మనసు జగనన్నకు కూడా ఉందనీ ఆమె చెప్పారు.
చంద్రబాబుకు మాట నిలుపుకునే తత్వం ఎన్నడూ లేదని ఆమె విమర్శించారు. రెండ్రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం అన్న రెండు వాగ్దానాలను చంద్రబాబు విస్మరించారని ఆమె గుర్తు చేశారు."ప్రాజెక్టులు కట్టడం నష్టమట, ఉచితంగా ఏదైనా ఇస్తే జనం సోమరులవుతారట. ఇవన్నీ బాబు రాసుకున్న మనసులో మాట పుస్తకంలోని మాటలే..."అని షర్మిల ఎద్దేవా చేశారు. బాబు పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచారనీ, బకాయిల వసూళ్లకు ఒత్తిడి తేగా నాలుగు వేలమంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ ఆమె అన్నారు. "దీన్నంతా మీలో ఎవరైనా మరచిపోగలరా ?" అని షర్మిల జనాన్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రశ్నించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతులను క్షోభ పెడుతోందనీ, వాళ్ల కడుపుల మీద కొడుతోందనీ ఆమె విమర్శించారు. పేదపిల్లలు చదువుకోవడానికి వీలు కల్పించే ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకాన్ని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్నీ ఈ ప్రభుత్వం నీరుగార్చిందని ఆమె ఆరోపించారు. అన్ని విధాలుగ విఫలమైన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధానప్రతిపక్షం టిడిపి చోద్యం చూస్తోందని ఆమె నిందించారు.
"నేను రాజన్న పాదాన్ని, జగనన్న వదిలిన బాణాన్ని... ఈ జిల్లాలో (వైయస్ఆర్ కడప జిల్లా) ఐదు రోజులుగా జనం నా పట్ల చూపిన ఆదరణను నేను మరువలేను. మిగతా జిల్లాలకు కూడా వెళుతున్నాను. నాతో కదం తొక్కిన అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా... "అని ఆమె జనం హర్షధ్వానాల మద్య అన్నారు. పార్నపల్లె సభతో కడప జిల్లాలో షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి అనంతపురం జిల్లాలోకి షర్మిల అడుగుపెడుతున్నారు.