కిడ్నీ బాధితుడికి అండగా నిలిచిన షర్మిల

2 Mar, 2013 11:39 IST
బెల్లంకొండ (గుంటూరు జిల్లా), 2 మార్చి 2013: రెండు కిడ్నీలూ పాడైపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక రోగికి శ్రీమతి షర్మిల అండగా ఉంటామంటూ ముందుకు వచ్చారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలానికి చెందిన నారుమళ్ళ శ్రీనివాస్‌కు రెండు కిడ్నీలూ పాడుపోయాయి. కిడ్నీ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్రీనివాస్‌ భార్య భాగ్యలక్ష్మి తన కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే, కిడ్నీ మార్పిడికి కనీసం రూ. 5 లక్షలు ఖర్చవుతుందంటూ వైద్యులు చెప్పారు. తమకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసినా వారు అంత సొమ్మును కూడబెట్టలేకపోయారు. దీనితో ఏమి చేయాలో తోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తమ మండలానికి వచ్చిన శ్రీమతి షర్మిలను శ్రీనివాస్‌ దంపతులు శనివారం కలుసుకున్నారు. తమ ఇబ్బందులు చెప్పుకుని విలపించారు.

శ్రీనివాస్‌ దంపతుల అవస్థను విన్న శ్రీమతి షర్మిల చలించిపోయారు. శ్రీనివాస్‌ కిడ్నీ మార్పిడికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శ్రీమతి షర్మిల మాట ఇచ్చిన వెంటనే గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌సిపి యువజన విభాగం నాయకులు అక్కడికక్కడే రూ. 30 వేలు అందజేశారు. శస్త్ర చికిత్సకు అన్ని విధాలుగా చేయూత అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

తన భర్తను బతికించుకోవాలన్న ఆశతోనే తాను శ్రీమతి షర్మిల సాయం అర్థించేందుకు వచ్చినట్లు భాగ్యలక్ష్మి తెలిపింది. తమకు ఉన్న పొలం అంతా అమ్ముకున్నా కిడ్నీ మార్పిడికి అయ్యే సొమ్ము రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు నిమ్సు ఆస్పత్రిలో చూపిస్తానని శ్రీమతి షర్మిల హామీ ఇవ్వడంతో తనకు సంతోషంగా ఉందని కిడ్నీ రోగి నారుమళ్ళ శ్రీనివాస్‌ ఆనందం వ్యక్తం చేశాడు. శ్రీమతి షర్మిల భరోసాతో తన ఆరోగ్యం కుదుటపడుతుందన్న నమ్మకం కలుగుతోందన్నాడు. ఇంత వరకూ తన ఆరోగ్యం విషయంలో చాలా భయం ఉండేదన్నాడు. బతుకుపై భరోసా కలిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.