కన్నీటి కరవుకు కారకుడు చంద్రబాబు..!

29 Oct, 2015 17:24 IST
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు..!
ఎండిన డెల్టా..కనిపించని నీటిచుక్క..!

వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎగువ రాష్ట్రాల నుంచి చుక్క నీరు రాక...పంటలన్నీ ఎండిపోయి రైతులు అల్లాడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సాగునీరు కాదు కదా కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  మహరాష్ట్ర, కర్నాటక నుంచి ఏపీకి రావాల్సిన వాటా అందడం లేదని ..కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి నీళ్లు తీసుకొచ్చేలా చూడాలని చంద్రబాబుకు హితవు పలికారు. 

కృష్ణాడెల్టాలో చుక్క  నీరు లేకపోవడం భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారన్నారు నాగిరెడ్డి . ఎగువ రాష్ట్రాల నుంచి ఏపీకి ఒక్క టీఎంసీ నీరు కూడా అందడం లేదని ...పంటలన్నీ ఎండిపోయి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నీరు ఇవ్వని ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డ్ సాధించారని దుయ్యబట్టారు. 2004లో ఇదే పరిస్థితి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆల్మట్టి నుంచి  నీరు విడదల చేయాలని అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు ఎండిపోతున్న పంటలను పట్టించుకోడు. రావాల్సిన వాటాకోసం కేంద్రంలో మిత్రపక్షం ఉండికూడా చోద్యం చూస్తున్నాడని విమర్శించారు.

పట్టిసీమ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి కోట్లాది రూపాయలు మింగేశారే తప్ప చుక్క నీరు ఇవ్వలేకపోయారని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. మోసపూరితమైన కార్యక్రమాలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాధారమైన కృష్ణా పరివాహాక ప్రాంతానికి కృష్ణానదీబోర్డు ఉండాలన్నారు.