పార్టీ ఫిరాయింపు పరిశీలన న్యాయ సమీక్ష పరిధిలోదే..!

3 Mar, 2016 13:04 IST

() అసెంబ్లీ వ్యవహారాలు న్యాయస్థానం పరిశీలించవచ్చు

() కోర్టు తీర్పుల్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది

() చంద్రబాబు అసలు గుట్టు బయట పడుతోంది

హైదరాబాద్) ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశ0 న్యాయస్థానాల పరిశీలనలోకి వస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇందుకు సంబంధించిన కేస్ లాస్ ను ఆయన ఉదహరించారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

        ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మరో పార్టీ గూటిలోకి మారేందుకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయని బుగ్గన రాజా అన్నారు. ఎమ్మెల్యేలు స్పీకర్ కు పార్టీని విలీనం చేస్తున్నట్లుగా సమాచారం ఇవ్వాలని, అందులోనూ మూడింట రెండు వంతుల మంది ఇందుకు లిఖిత పూర్వకంగా గ్రాటిఫై చేయాలని ఆయన వివరించారు. మిగిలిన మూడో వంతు మంది స్వతంత్రులుగా ఉండిపోతారు తప్పితే వేరే పార్టీలోకి వెళ్లటానికి వీలుపడదని వివరించారు.  ఇంత స్పష్టంగా నిబంధనలు ఉంటే స్పీకర్ నిర్ణయమే అంతిమం అని, దానిని ఎవరూ ప్రశ్నించజాలవు అని ఊదరగొడుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం స్పీకర్ కు విశేష అధికారాలు ఉన్నాయని చెప్పడం సరికాదని అన్నారు. నియమనిబంధనలు పాటించకపోతే కోర్టులు జోక్యం చేసుకొంటాయని చెప్పారు. ఇదే విషయాన్ని బాలచంద్రన్ వెర్సస్ ఎడ్యూరప్ప కేసులో ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని ఆయన వివరించారు.

        ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ రోజూ ఒకటే విషయాన్ని పదే పదే చెబుతుంటారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్, నిప్పు అంటూ చాలా గొప్పలు చెబుతుంటారు. కానీ అవేమీ ఆచరణలో కనిపించటం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్  లో జరుగుతున్నది అందరికీ తెలుస్తూనే ఉంది. వంద మంది ఉన్న చోట పదిమందిని ప్రలోభ పెట్టి తీసుకొని వెళ్లవచ్చు గాక. జరిగింది ఏమిటి అనేది అందరికీ తెలుసని రాజా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వచ్చినా అభివ్రద్ధి చూసి వచ్చారు అంటున్నారు, తెలంగాణ లో మాత్రం అన్యాయం, దుర్మార్గం అంటూ కబుర్లు చెబుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలు పెడుతున్నారు, ఆశలు చూపుతున్నారు ఇటువంటి పోకడలకు అంతా తలదించుకోవాలి అని రాజేంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పదే పదే చెప్పే క్యారెక్టర్ , విజన్ ఎక్కడకు వెళ్లిపోయాయి అని ప్రశ్నించాలి. ఇదేనా మీ క్యారెక్టర్,,,ఇదేనా భావితరాలకు మీరు అందించే సందేశం అని ఆయన నిలదీశారు.

ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని ఎమ్మెల్యే రాజా అన్నారు. ఎందుకు వెళ్లారు అనేది వెళ్లిన వారి మనస్సులకు తెలుసు అని, తీసుకొని వెళ్లినవారు..ఎందుకు తీసుకొని వెళ్లారు అనేది వారి మనస్సులకు తెలుసు అని, ఆఖరికి తెలుగుదేశం నాయకులు ఈ విషయంలో మనస్సులో బాధ పడుతున్నారని, ఎందుకు బాధ పడుతున్నారో కూడా వాళ్లకు తెలుసని రాజా సున్నితంగా చురకలు అంటించారు.

        పార్టీ మారుతున్న వారి విషయంలో సహస న్యాయసూత్రాలకు భిన్నంగా స్పీకర్ నిర్ణయాలు ఉంటే దాని మీద న్యాయస్థానాలు ప్రశ్నించటం తప్పదు. ఇదే విషయాన్ని మహా చంద్రప్రసాద్ వెర్సస్ వైస్ ఛైర్ పర్సన్ ఆఫ్ బీహార్ కేసులోనూ, సుధాకర్ వెర్సర్ జీవ ప్రసాద్ కేసులోనూ స్పష్టం చేయటం జరిగింది. ఆఖరికి ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు వేరే పార్టీలకు ప్రచారం చేసినా పదవిని కోల్పోతారని చట్టాలు చెబుతున్నాయని ఆయన విశ్లేషించారు. బాలచందర్ వెర్సస్ ఎడ్యురప్ప కేసులో తాజాగా స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు సమీక్షిస్తామని తేలిందని గుర్తు చేశారు.

        వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చాలినంత మెజార్టీ ఉందని ఎమ్మెల్యే రాజా గుర్తు చేశారు. అయినప్పటికీ ఎందుచేత ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ప్రజల ఆశీస్సులు కోల్పోయారని, అందుకే ఫిరాయింపుల మీద ఆధారపడుతున్నారని ఆయన అన్నారు. ఆఖరికి వైఎస్సార్సీపీ లోని 67 మంది ఎమ్మెల్యేలను కూడా ఇబ్బంది పెట్టవచ్చని, కానీ అయిదు కోట్ల ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని ఆయన వివరించారు. ఇది వెంటనే ప్రభావం చూపించక పోవచ్చని, కానీ తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడ అమితమైన ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.