జననేతకు నల్గొండ జిల్లా రుణపడింది: కోమటిరెడ్డి
నల్గొండ, 2 సెప్టెంబర్ 2012 : నల్గొండ జిల్లా ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి రుణపడి ఉంటారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారంనాడు రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుని కోమటిరెడ్డి కంటతడి పెట్టారు. తమ జిల్లాలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ తనను రాజశేఖరరెడ్డి చిన్న వయసులోనే ఎమ్మెల్యేని చేశారని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా మంత్రి పదవులు ఇచ్చి తనను ఆదరించిన వ్యక్తి డాక్టర్ వైయస్‌ఆర్ అని కోమటిరెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు.
కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతగో బలపరిచారని కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో అతిపెద్ద ఆస్పత్రి కోసం ఆయన కృషిచేశారని, కాని రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ ఆస్పత్రికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాను ఫ్లోరైడ్ కోరల నుంచి రక్షించడానికి వైయస్‌ఆర్ చేసిన కృషి నిరుపమానమని కొనియాడారు. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాల పేర్లు మారిస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు మంత్రులు వైయస్‌ఆర్‌పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాంటి మార్పులూ చేయకుండా కొనసాగిస్తే ప్రభుత్వానికే మేలనా కోమటిరెడ్డి సూచించారు.